logo

పిన్నెల్లిపై అనర్హత వేటువేయాలి

మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు

Published : 23 May 2024 05:52 IST

ఓట్ల లెక్కింపు రోజు రాష్ట్రంలో అరాచకాలు జరిగే అవకాశం
వెంటనే సీఎస్‌ జవహర్‌రెడ్డిని మార్చాలి
ఎంపీ రఘురామకృష్ణరాజు

మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజు, చిత్రంలో గంటా, సోమిరెడ్డి, విష్ణుకుమార్‌రాజు, తదితరులు 
ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. బుధవారం ఉదయం విశాఖలోని గంటా శ్రీనివాసరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎస్‌ జవహర్‌రెడ్డిని తక్షణమే మార్చాలని.. లేకుంటే ఓట్ల లెక్కింపు రోజు రాష్ట్రంలో అనేక చోట్ల అరాచకాలు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే రాష్ట్రంలో పోలింగ్‌ శాతం పెరిగిందన్నారు. ఉద్యోగులు, ఇతర అన్ని వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికల ముందు జగన్‌ బ్లఫ్‌ మాస్టర్‌గా వ్యవహరించారని, ఆయన విదేశీ పర్యటనకు పొడిగింపు ఉంటుందని.. జూన్‌ 4 తర్వాత ఆయన ఎక్కడుంటారో తెలియని పరిస్థితి ఉంటుందన్నారు. ఎన్నికల్లో వైకాపా హింసకు పాల్పడితే.. సాక్షి ఛానల్‌లో మాత్రం తెదేపా హింస చేసిందంటూ ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. 175కి 175 సీట్లు వస్తాయని మంత్రి బొత్స చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో కూటమి గెలుపు తథ్యమని, తాను గెలిచిన తర్వాత వైకాపాకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానన్నారు.

సర్వేలన్నీ కూటమి వైపే : కూటమిదే గెలుపని దేశంలోని సర్వేలన్నీ చెబుతున్నాయని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాలు కూటమికి అనుకూలంగా ఉందన్నారు. బొత్స, వైవీ సుబ్బారెడ్డి వంటి నాయకులు జగన్‌ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్న మాటలకు నవ్వు వస్తోందని.. అదే రోజు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. మాజీమంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. సాధారణంగా వైకాపాకు ఎన్ని సీట్లు వస్తాయనది ఐప్యాక్‌ చెప్పాలని.. అయితే తనకు ఇన్ని సీట్లు వస్తాయని జగన్‌ ఐప్యాక్‌కు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, తెదేపా నాయకులు కోరాడ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని