logo

యథాస్థితికి 25 చౌక దుకాణాలు

రేషను సరకుల పంపిణీలో గత నెల చోటుచేసుకున్న ఇబ్బందులను తగ్గించడానికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.

Updated : 23 May 2024 06:22 IST

జూన్‌లో సకాలంలో సరకుల పంపిణీకి చర్యలు 

ఎండీయూ వాహనం ద్వారా సరకుల పంపిణీ(పాతచిత్రం) 
వన్‌టౌన్, న్యూస్‌టుడే: రేషను సరకుల పంపిణీలో గత నెల చోటుచేసుకున్న ఇబ్బందులను తగ్గించడానికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. పౌరసరఫరాల సంస్థ (సీఎస్‌సీ) గోదాములకు అనుసంధానంగా ఉండే చౌక దుకాణాలను గతంలో ఆప్టిమైజ్‌ పద్ధతిలో అటుఇటు మార్పు చేశారు. ఫలితంగా మర్రిపాలెంలోని సీఎస్‌సీ గోదాము-2 నుంచి దాదాపు 80 దుకాణాలను మర్రిపాలెం గోదాము-1కు సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో మధురవాడ, పీఎంపాలెం తదితర ప్రాంతాల పరిధిలోని 25 దుకాణాలు భీమునిపట్నం గోదాము పరిధిలోకి పంపారు. ఒకేసారి 80 డిపోలను మర్రిపాలెం-2 గోదాము నుంచి తప్పించడంతో ఇక్కడ ఉన్న హమాలీలకు పనులు లేకుండా పోయాయి. ఇదే సమయంలో భీమునిపట్నం గోదాము పరిధిలో ఉండే హమాలీలకు పనిభారం పెరిగింది. దీంతో మర్రిపాలెం గోదాము-2లో పనిచేసే హమాలీలు నిరసనకు దిగారు. గోదాము నుంచి సరకులు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఫలితంగా గత నెలలో సరకుల సరఫరాలో తీవ్ర జాప్యం జరిగింది. ఈనెల 4వ తేదీ వచ్చే వరకు పలు చౌక దుకాణాల పరిధిలో సరకుల పంపిణీ మొదలు కాలేదు. ఆయా అంశాలపై పౌరసరఫరాల సంస్థ అధికారులతో ఇటీవల జేసీ సమావేశమై దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భీమునిపట్నంకు బదలాయించిన 25 దుకాణాలను యథాతథంగా మర్రిపాలెం గోదాము-2కు బదలాయించారు. దీంతో హమాలీల నిరసన విరమించారు.

మర్రిపాలెం గోదాము-1 స్టేజ్‌2 గుత్తేదారు క్వింటాలు బియ్యం చేరవేతకు రూ.21 తీసుకుంటే, మర్రిపాలెం గోదాము-2 స్టేజ్‌2 గుత్తేదారు క్వింటాలుకు రూ.31 వసూలు చేస్తున్నారు. సరకుల తరలింపు ధరలో భారీ వ్యత్యాసం ఉండడంతో పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులు ఆప్టిమైజ్‌ పద్ధతిలో దుకాణాలను ఇతర గోదాములకు కేటాయించి, మర్రిపాలెం గోదాము-2కు తగ్గించారు. గుత్తేదారుల నియామక సమయంలో వ్యత్యాసాలను నియంత్రించి ఉంటే ఈ ఇబ్బందులు తలెత్తేవి కావు. స్టేజ్‌2 గుత్తేదారునితో అధికారులు చర్చించి క్వింటాలు రూ.3 మేర తగ్గించి అదనంగా మరో 25 డిపోలకు సరకులు చేరవేసే బాధ్యతను అప్పగించారు. ఫలితంగా తాత్కాలికంగా ఇబ్బంది తొలగినట్లయింది. వచ్చే నెలలో సకాలంలో సరకుల తరలింపునకు మార్గం సుగమమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని