logo

నేడు ఉక్కు కార్మికులకు మిగులు వేతనం చెల్లింపు : సీఎండీ

ఉక్కు కార్మికులకు మిగిలిన సగం వేతనాన్ని గురువారం సాయంత్రంలోపు చెల్లిస్తామని ఉక్కు సీఎండీ అతుల్‌భట్‌ తెలిపారు.

Updated : 23 May 2024 06:10 IST

సమావేశంలో పాల్గొన్న ఉక్కు సీఎండీ అతుల్‌భట్, డైరెక్టర్లు 

ఉక్కునగరం (స్టీల్‌సెక్టారు-3), న్యూస్‌టుడే : ఉక్కు కార్మికులకు మిగిలిన సగం వేతనాన్ని గురువారం సాయంత్రంలోపు చెల్లిస్తామని ఉక్కు సీఎండీ అతుల్‌భట్‌ తెలిపారు. బార్స్‌లో (బయోమెట్రిక్‌ అటెండెన్స్‌) తొలుత వైద్యపరమైన అనుమతులు అమలు చేస్తామని, మిగిలిన అంశాలపై జూన్‌ ఒకటిన ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. వివిధ అంశాలకు సంబంధించి విశాఖ ఉక్కు యాజమాన్యం అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ... కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్న నేపథ్యంలో బుధవారం ఉక్కు సీఎండీ, డైరెక్టర్లు కలిసి అఖిలపక్ష కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను నాయకులు వివరించారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, ఉక్కు ఉత్పత్తి మెరుగునకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని సీఎండీ కోరారు. పూర్తిస్థాయి ఉత్పత్తి ద్వారా సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఇబ్బందుల్ని అధిగమిస్తామన్నారు. సమావేశంలో ఉక్కు డైరెక్టర్లు గణేష్, ఏకే.బాగ్చి, జీవీఎన్‌.ప్రసాద్, ఎస్‌.సి.పాండే, కార్మిక నాయకులు డి.ఆదినారాయణ, కె.ఎస్‌.ఎన్‌.రావు, ఎం.రాజశేఖర్, ఎన్‌.రామచంద్రరావు, జె.అయోధ్యరామ్, యు.రామస్వామి, కె.శ్రీనివాస్, సన్యాసిరావు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని