logo

విశాఖలో లైంగిక వేధింపులు

తగరపువలస సమీప సంగివలస ఎన్‌ఆర్‌ఐ కళాశాలకు చెందిన ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత విద్యార్థినులు గురువారం దిశా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా..

Published : 24 May 2024 03:46 IST

రేడియాలజీ విభాగాధిపతిపై విద్యార్థినుల ఫిర్యాదు

ఎండాడ, న్యూస్‌టుడే: తగరపువలస సమీప సంగివలస ఎన్‌ఆర్‌ఐ కళాశాలకు చెందిన ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత విద్యార్థినులు గురువారం దిశా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా.. సంబంధిత కళాశాల బీఎస్సీ రేడియాలజీ విభాగంలో ఈ ఏడాది 16 మంది విద్యార్థినీ, విద్యార్థులు ప్రవేశం పొందారు. జనవరి 23 నుంచి తరగతులు ప్రారంభమై ఈ నెల 12వ తేదీ వరకు జరిగాయి. 13న ఎన్నికలు జరిగినందున 14 నుంచి 28వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అయితే ఈనెల 3వ తేదీన కళాశాలలో తరగతులు జరుగుతున్నపుడు రేడియాలజీ విభాగాధిపతి టి.నాగేశ్వరరావు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కళాశాల డీన్‌ పి.వి.సుధాకర్‌కు బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. 20 రోజులైనా ఎలాంటి చర్యలు లేకపోవడంతో దిశా పోలీసులను ఆశ్రయించారు. ఏసీపీ వివేకానంద ఆదేశాల మేరకు సీఐ కల్యాణి విచారణ చేపట్టారు. ముగ్గురు విద్యార్థినులు ఫిర్యాదు చేశారని, ఆ మేరకు కేసు నమోదు చేసి చర్యలు చేపడతామని సీఐ పేర్కొన్నారు. ఈ విషయమై డీన్‌ సుధాకర్‌ వద్ద ప్రస్తావించగా..ఈ అంశం కళాశాల అంతర్గత ఫిర్యాదుల కమిటీకి నివేదించామన్నారు. వేసవి సెలవుల కారణంగా, సభ్యులు అందుబాటులో లేక సంబంధిత కమిటీ ఆలస్యంగా విచారణ చేపట్టిందన్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు