logo

అప్పన్నకు ద్వితీయ చందన సమర్పణ

వరాహ, నృసింహ అవతారాల కలయికతో అద్వితీయ మూర్తిగా సింహగిరిపై కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామికి వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం రెండో విడత చందన సమర్పణ సంప్రదాయబద్ధంగా జరిగింది.

Published : 24 May 2024 04:02 IST

చందనం అలంకరణలో స్వామి

న్యూస్‌టుడే, సింహాచలం: వరాహ, నృసింహ అవతారాల కలయికతో అద్వితీయ మూర్తిగా సింహగిరిపై కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామికి వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం రెండో విడత చందన సమర్పణ సంప్రదాయబద్ధంగా జరిగింది. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన, బాలభోగం సేవలు జరిపారు.

  • అంతరాలయంలో స్వామి చెంతన విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం పూజలు జరిపారు. సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ముందుగా సిద్ధం చేసిన మూడు మణుగుల (125 కిలోలు) శ్రీగంధాన్ని వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామికి అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో శీతలోపచారాలు సమర్పించారు. రెండో విడత చందన సమర్పణతో స్వామి ద్విగుణీకృత పరిమాణంలో భక్తులకు దర్శనమిచ్చారు.

వైభవంగా వైశాఖ తిరుమంజనం

స్వామి, అమ్మవార్లకు తిరుమంజనం నిర్వహిస్తున్న అర్చకులు

వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామి వారికి వైశాఖ స్నపన తిరుమంజనం వైభవోపేతంగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామి, అమ్మవార్లు, ఆళ్వారాచార్యులను ఆలయ ఆస్థాన మండపంలోని వెండి సింహాసనంపై కొలువుదీర్చారు. విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం పూజలు జరిపారు. పంచామృతాలు, ఫలోదకాలు, సుగంధ ద్రవ్యాలతో దేవతామూర్తులకు విశేష స్నపనం నిర్వహించారు. గోవిందరాజ స్వామిని చందనంతో అలంకరించి శీతల నివేదనలు సమర్పించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ నేతృత్వంలో అర్చక పరివారం వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈవో సింగల శ్రీనివాసమూర్తి దంపతులు, లక్ష్మీకాంత నాయకో దాసుడు తిరుమంజనంలో పాల్గొని స్వామిని సేవించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని