logo

అనధికార విచారణ ఎందుకు?

విశాఖ నగరంలోని ఉత్తర నియోజకవర్గంలో ‘బర్మా క్యాంపు’ ప్రాంతంలో జరిగిన దాడి ఘటనపై ఇరువర్గాలతో అధికారులు మాట్లాడే ప్రయత్నం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి విచారించారు.

Published : 24 May 2024 04:04 IST

‘బర్మా క్యాంపు’ దాడి ఘటనపై అధికారుల దృష్టి
సందేహం వ్యక్తం చేస్తున్న బాధితులు
ఈనాడు, విశాఖపట్నం

విశాఖ నగరంలోని ఉత్తర నియోజకవర్గంలో ‘బర్మా క్యాంపు’ ప్రాంతంలో జరిగిన దాడి ఘటనపై ఇరువర్గాలతో అధికారులు మాట్లాడే ప్రయత్నం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి విచారించారు. ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అసలు ఏం జరిగిందని తెలుసుకునేందుకు మళ్లీ చేస్తున్న ప్రయత్నాల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న సందేహాలను బాధితులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ ఘటనపై ఇప్పటికే పోలీసు కమిషనర్‌ ఇచ్చిన నివేదికను జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టరు మల్లికార్జున... కొద్ది రోజుల కిందటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపించారు. ఇప్పుడు మళ్లీ అనధికార విచారణకు రావాలని అధికారుల నుంచి బాధితులకు ఫోన్లు రావడంపై అనుమానాలు కలుగుతున్నాయి. 

  • వైకాపాకు ఓటు వేయలేదని ఆ పార్టీకి చెందిన కొందరు దాడి చేశారని నూకరత్నం ఆమె కుటుంబ సభ్యులు చెబుతుండగా... పోలీసులు మాత్రం వ్యక్తిగత కుటుంబ తగాదాగా కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో జేసీకి వినతి ఇచ్చారు. తమకు న్యాయం జరగలేదని, రాజకీయ కారణాలతో దాడి జరిగితే వ్యక్తిగత కారణాలంటూ కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  • ఈ తరుణంలో బుధవారం గోపాలపట్నం తహసీల్దార్‌ కార్యాలయానికి ఆర్డీవో ఇరువర్గాలను పిలిపించగా.. బాధితులు హాజరవ్వలేదు. వచ్చిన ఒక వర్గంలోని కొందరితో మాట్లాడి పంపించేశారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకే పిలిపించారా? ఇంకేదైనా ఉందా? అన్నది చర్చనీయాంశమవుతోంది. ఈ నెల 15వ తేదీ రాత్రి ఘటన చోటుచేసుకోగా... 16న వెలుగులోకి వచ్చింది. 17న బాధితులు మీడియా ముందుకురావడంతో రాజకీయ కోణం బయటపడింది. అయినప్పటికీ అధికారులు వాస్తవాలు పట్టించుకోవడం లేదన్నది బాధితుల ఆరోపణ. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని