logo

ఏదీ... మత్స్యకార భరోసా?

మత్స్యకార భరోసా నిధులు ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఏటా మే రెండో వారంలో మత్స్యకార భరోసా కింద రూ.10 వేల చొప్పున బ్యాంకు ఖాతాలకు  ప్రభుత్వం జమ  చేసేది. ఈసారి అలా జరగలేదు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లో ఉంది.

Updated : 24 May 2024 06:06 IST

లబ్ధిదారుల గుర్తింపు పూర్తయినా అందని నిధులు

చేపలరేవులో నిలిపి ఉన్న బోట్లు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: మత్స్యకార భరోసా నిధులు ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఏటా మే రెండో వారంలో మత్స్యకార భరోసా కింద రూ.10 వేల చొప్పున బ్యాంకు ఖాతాలకు  ప్రభుత్వం జమ  చేసేది. ఈసారి అలా జరగలేదు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే నెల 10వ తేదీ వరకు కోడ్‌ అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే ఈ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది. 

  • విశాఖ జిల్లాలో మరపడవలు, ఇంజిను పడవలు, తెప్పలు కలిపి 2,264 వరకు ఉన్నాయి. వీటిలో 695 వరకు మరపడవలున్నాయి. మిగిలినవన్నీ ఇంజిను పడవలు, తెప్పలు. చేపలరేవుతో సహా 15 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లున్నాయి. ఆయా కేంద్రాల్లోని మత్స్యకారులు, బోట్లకు సంబంధించిన సర్వే ప్రక్రియను మత్స్యశాఖ ఇన్‌ఛార్జి జేడీ విజయకృష్ణ ఆధ్వర్యంలో 15 బృందాలు నిర్వహించాయి. చేపలవేటపై 13,517 మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు. ఆ వివరాలను మత్స్యశాఖ కమిషనర్‌కు నివేదించారు. ఇది కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమే. అన్ని జిల్లాల నుంచి వచ్చే నివేదికలను పరిశీలించి ఆరంచెల గుర్తింపు ప్రక్రియను మత్స్యశాఖ సంచాలకుల కార్యాలయం చేపట్టనుంది. తుది వడబోతలో ఎంతమంది మత్స్యకారులున్నది తేలనుంది. లబ్ధిదారులల్లో ఐటీ చెల్లింపుదారులు, 300 యూనిట్లు దాటి విద్యుత్తును వినియోగించేవారు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిపొందేవారు ఉంటే భరోసా అందబోదు. అటువంటి వారి పేర్లు తొలగించి తుది జాబితాను మత్స్యశాఖ డైరెక్టర్‌ కార్యాలయం విడుదల చేయనుంది. ఆ జాబితా ప్రకారమే మత్స్యకార భరోసా కింద రూ.10వేల ఆర్థిక సహాయం అందనుంది. వచ్చే నెల 15 నుంచి సముద్రంలో ఉత్పత్తుల వేట ఆరంభం కానుంది. ఎన్నికల ఫలితాల తరువాత ఏర్పడబోయే ప్రభుత్వ నిర్ణయం ప్రకారం భరోసా నిధులు అందేసరికి మరికొంత సమయం పట్టనుంది. 
  • ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా ఇటీవల కొన్ని పథకాలకు నిధులను ఈసీ అనుమతితో అధికారులు విడుదల చేశారు. ఇదే విధానాన్ని తమకూ వర్తింపజేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఏప్రిల్‌15 నుంచి జూన్‌ 15 వరకు సముద్ర ఉత్పత్తుల వేటపై నిషేధం ఉన్నందున నిషేధ సమయంలో భరోసా నిధులు ఇస్తే తమ అవసరాలు తీరుతాయని, వేట మొదలయ్యాక ఇస్తే ఏం లాభమని వీరు ప్రశ్నిస్తున్నారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని