logo

అవకాశం ఉన్నా.. వినియోగం సున్నా

ధనార్జనే ధ్యేయంగా కొంతమంది వ్యాపారులు మధురఫలం మామిడిని విషతుల్యంగా మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. సహజంగా మగ్గించిన మామిడిపండ్లను గతంలో మార్కెట్‌కు తీసుకువచ్చేవారు.

Published : 24 May 2024 04:39 IST

నిరుపయోగంగా మామిడి రైఫనింగ్‌ ఛాంబర్లు
నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే 

సహజంగా మగ్గించిన మామిడి పండ్లు

నార్జనే ధ్యేయంగా కొంతమంది వ్యాపారులు మధురఫలం మామిడిని విషతుల్యంగా మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. సహజంగా మగ్గించిన మామిడిపండ్లను గతంలో మార్కెట్‌కు తీసుకువచ్చేవారు. ఇప్పుడు రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెట్టి ప్రజారోగ్యానికి ముప్పు తెస్తున్నారు. ఈ ఏడాది మామిడి దిగుబడి తగ్గింది. దీంతో మార్కెట్‌లో ఈ పండ్లకు గిరాకీ పెరిగింది. రకాన్ని బట్టి డజను పండ్లు రూ. 300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. త్వరగా రంగు రప్పించి మార్కెట్‌లో అమ్ముకోవాలన్న ఆరాటంతో రసాయనాలు వినియోగించి పక్వానికి తెస్తున్నారు. ఇవి చూడటానికి రంగుగా కనిపించినా తినేసరికి పుల్లగా ఉంటున్నాయి. 

పెదబొడ్డేపల్లి మార్కెట్‌ యార్డులో నిరుపయోగంగా రైఫనింగ్‌ కేంద్రం

  • జిల్లాలో నర్సీపట్నం, నాతవరం, కె.కోటపాడు, సబ్బవరం, నక్కపల్లి, ఎస్‌.రాయవరం తదితర మండలాల్లో దాదాపు పాతికవేల ఎకరాల వరకు మామిడితోటలు ఉన్నాయి. బంగినపల్లి, సువర్ణరేఖ, చెరకురసం తదితర రకాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమవుతున్న పండ్లు చూడటానికి బాగానే ఉన్నా రుచి అంతగా ఉండటం లేదని వినియోగదారులు చెబుతున్నారు. చాలామంది రసాయనాలు వినియోగించి మగ్గించడమే ఇందుకు కారణమన్నది బహిరంగ రహస్యం. కార్బైడ్‌తో మగ్గించడాన్ని 2012లోనే ప్రభుత్వం నిషేధించినా ఇప్పటికీ చాలామంది వినియోగిస్తున్నారని చెబుతున్నారు. గతంలో అధికారులు మార్కెట్‌ల్లో తనిఖీలు నిర్వహించి వ్యాపారులను హెచ్చరించేవారు. ఈ ఏడాది ఎక్కడా తనిఖీలు లేవు. 
  • ఆరోగ్యదాయకంగా ఉండేలా పండ్లను మగ్గించేందుకు నర్సీపట్నం, పాయకరావుపేట మార్కెట్‌ యార్డుల్లో దశాబ్దం కిత్రమే దాదాపు రూ. 50 లక్షలతో రైఫనింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినా ఇవి పూర్తిస్థాయిలో వినియోగమయ్యేలా మార్కెటింగ్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. రైతులు, వ్యాపారులు పక్వానికి వచ్చిన కాయలను వీటిలో సహజంగా మగ్గించుకోవచ్చు. మూడు రోజుల్లో సహజంగా పక్వానికి వస్తాయి. వీటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తే ప్రజలకు సహజ రుచితో కూడిన పండ్లను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

రసాయనాలతో మగ్గించిన మామిడి పండ్లు 

మామిడి తోటలను రైతులు వ్యాపారులకు లీజుకు ఇస్తుంటారు. హానికర రసాయనాలతో పండ్లను మగ్గించడం నేరమని యంత్రాగం విస్తృతంగా ప్రచారం చేయాలి. కోత నుంచి మార్కెట్‌కు చేర్చేవరకు తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యానశాఖ అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని