logo

బడి బస్సుల అనుమతులకు బ్రేకులు!

వేసవి సెలవులు ముగిసి, జూన్‌ 12 నుంచి పాఠశాలలు తిరిగి తెరవనున్నారు. పిల్లలను బడులకు తీసుకెళ్లే ప్రతి వాహనం నిబంధనలకు అనుగుణంగా ఉందా, లేదా అన్నది రవాణా శాఖ అధికారులతో తనిఖీ చేయించుకుని సామర్థ్య ధ్రువీకరణ పత్రం (ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌) పొందాలి.

Published : 24 May 2024 04:39 IST

నిలిచిన ఈ-ప్రగతి సాఫ్ట్‌వేర్‌
అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే 

రవాణా కార్యాలయం వద్ద  పాఠశాలల బస్సులు

వేసవి సెలవులు ముగిసి, జూన్‌ 12 నుంచి పాఠశాలలు తిరిగి తెరవనున్నారు. పిల్లలను బడులకు తీసుకెళ్లే ప్రతి వాహనం నిబంధనలకు అనుగుణంగా ఉందా, లేదా అన్నది రవాణా శాఖ అధికారులతో తనిఖీ చేయించుకుని సామర్థ్య ధ్రువీకరణ పత్రం (ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌) పొందాలి. అప్పుడే బడి బస్సులు రోడ్డెక్కాలి. కానీ ఈ ప్రక్రియకు తాత్కాలికంగా అవరోధం ఏర్పడింది. ధ్రువీకరణ ప్రతాల జారీకి అవసరమైన ఈ-ప్రగతి సాఫ్ట్‌వేర్‌ సేవలు నిలిచిపోయాయి. 

నకాపల్లి జిల్లాలో 419 పాఠశాల, కళాశాలల వాహనాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 160 వాహనాలకు మాత్రమే తనిఖీలు పూర్తయ్యాయి. వాస్తవానికి మే 16తోనే సామర్థ్య ధ్రువీకరణ పొందడానికి గడువు పూర్తయింది. కానీ చాలా వాహనాలు ఇంకా తనిఖీ చేయాల్సి ఉన్నందున గడువు పొడిగించారు బడులు తెరిచేలోగా ప్రతి ఒక్క బడి బస్సు ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంది. లేకుంటే వాహనాలు తిప్పడానికి వీలులేదని రవాణాశాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. దీంతో నిర్దేశిత ఫీజు చెల్లించిన పలు బడి బస్సులు అనకాపల్లి కార్యాలయానికి వచ్చాయి. తీరా గురువారం నుంచి వాహనాలకు ఫిట్నెస్‌ సర్టిఫికెట్లు జారీచేసే ఈ-ప్రగతి సాఫ్ట్‌వేర్‌ పనిచేయక పోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

బస్సులను పరిశీలిస్తున్న సిబ్బంది 


పేరుకుపోయిన బకాయిలు

ఈ ప్రగతి సాఫ్ట్‌వేర్‌ను 2015లో ప్రవేశపెట్టారు. రవాణా శాఖలో చాలా సేవలను దీనిద్వారా అందిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ సాప్ట్‌వేర్‌ నిర్వాహకులకు బకాయిలు చెల్లించకపోవడంతో పేరుకుపోయాయి. రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుండటంతో బకాయిలు వస్తాయో, రావో అన్న సందిగ్థంతో ఈ-ప్రగతి సాఫ్ట్‌వేర్‌ను గురువారం నుంచి నిలిపేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన్‌ సాఫ్ట్‌వేర్‌లో వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు వచ్చాయి. అయితే వాహన్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగం, ధ్రువీకరణ పత్రాల జారీపై ఇక్కడి సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన లేదు. దీనికితోడు ఇప్పటివరకు ఈ-ప్రగతి సాఫ్ట్‌వేర్‌లో వాహనాల ధ్రువీకరణకు ఫీజులు చెల్లించిన డబ్బులు తిరిగి వస్తాయా, లేక వాహన్‌ సాఫ్ట్‌వేర్‌లోకి మార్చవచ్చా అన్నదానిపై స్పష్టత లేదు. ఉన్నట్టుండి ఎలాంటి సమాచారం లేకుండా సాఫ్ట్‌వేర్‌ను ఆపేసి వాహనదారులను ఇబ్బందులకు గురిచేయడం తగదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం జిల్లాలోని పాఠశాల, కళాశాల వాహనాలతో పాటుగా ఇతర వాహనాల సామర్థ్య ధ్రువీకరణ ముందుకు సాగలేదు.


ఇబ్బందులు లేకుండా చూస్తాం..
- ప్రకాశరావు, ఇన్‌ఛార్జ్‌ ఆర్‌టీఓ, అనకాపల్లి 

ఈ-ప్రగతి సాఫ్ట్‌వేర్‌ గురువారం నుంచి నిలిచిపోయింది. సామర్థ్య ధ్రువీకరణ పత్రాలను వాహన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయించి అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని సక్రమంగా ఉన్న వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్రాలు అందిస్తాం. పాఠశాల, కళాశాలల వాహనాలకు సకాలంలో ధ్రువీకరణ చేయించుకోవాలి. ఇది లేకుండా తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు