logo

అందరి ‘నోటా’ అదే మాట..!

ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీ మెజారిటీతో అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నా.. చాలా నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఇదే సమయంలో ‘నోటా’కు పడిన ఓట్ల సంఖ్య ఎక్కువే ఉండొచ్చనే మాట అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తుంది. 

Published : 24 May 2024 04:40 IST

గత ఎన్నికల్లో భారీగా పోలైన ఓట్లు
రాష్ట్రంలో అత్యధికంగా అరకు పార్లమెంట్‌ పరిధిలోనే నమోదు
ఈనాడు, పాడేరు

ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీ మెజారిటీతో అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నా.. చాలా నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఇదే సమయంలో ‘నోటా’కు పడిన ఓట్ల సంఖ్య ఎక్కువే ఉండొచ్చనే మాట అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తుంది. 

సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఓట్ల పండగ ముగిసిన రోజు నుంచే అభ్యర్థుల గెలుపోటములపై ప్రధాన పార్టీలు అంచనాలు వేస్తూ వస్తున్నాయి. బూత్‌ల వారీగా పోలింగ్‌ సరళిని పరిశీలించి విజయం తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఈసారి విజయావకాశాలపై నోటా ప్రభావం అనేదానిపైనా చర్చ నడుస్తోంది. 2014 ఎన్నికల్లో నోటాకు పెద్దగా ఓట్లు పడలేదు. కానీ గత ఎన్నికల్లో అన్నిచోట్లా గణనీయంగానే పోలయ్యాయి. తాజా ఎన్నికల్లో కూడా అదే తీరున నోటాకు ఎక్కువ ఓట్లు పడితే అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం పడే ఆస్కారం లేకపోలేదని రాజకీయ వర్గాలు కంగారు పడుతున్నాయి.  

తెలిసి కొందరు.. తెలియక ఇంకొందరు..

‘ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలి. పోటీలో నిలిచే అభ్యర్థుల్లో సమర్థులైన నాయకుడిని ఎంచుకుని ఓటేయండి. బరిలో ఉన్న అభ్యర్థులెవరూ మీకు నచ్చలేదు అనుకుంటే పైవారెవరూ కాదు అనే నోటా గుర్తుకైనా ఓటు వేయండి. అంతేకాని ఓటు వేయకుండా ఉండొద్దు’ అని ఎన్నికల సంఘం ఓటర్లకు విజ్ఞప్తి చేస్తోంది. 2014లో ప్రవేశపెట్టిన ఈ నోటా పట్ల తొలి ఎన్నికల్లో ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం నోటా మీట నొక్కినవారి సంఖ్య భారీగా పెరిగింది. 2014లో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని తొమ్మిది నియోజకవర్గాల్లో 14,457 ఓట్లు నోటాకు పడితే... 2019లో ఈ సంఖ్య 48,621కి పెరిగింది. 

అభ్యర్థులు నచ్చక కొందరు నోటాకు ఓటేస్తే.. ఆ గుర్తు ఏంటో అవగాహన లేకుండానే ఓటేసేవారు చాలామంది ఉన్నారు. నిరక్షరాస్యుల్లో చాలామందికి నోటా అంటే ఏంటో ఇప్పటికీ తెలీదు. మన్యలోని గిరిజనుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులుఉంటారు. వారిలో అధికమంది పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రంలో గుర్తులు సరిగా పోల్చుకోలేక ఏదైతే ఏంటని ఆఖరిగా ఉండే బటన్‌ నొక్కేసి వచ్చేస్తున్నారు. మైదాన ప్రాంతం కంటే మన్యంలో నోటాకు రెండింతల ఓట్లు పోలవ్వడమే ఇందుకు నిదర్శనమని అధికారులు చెబుతున్నారు. 

ఓటేసేందుకు బారులుదీరిన మహిళలు (పాతచిత్రం) 


అరకులోనే అత్యధికం

గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 543 ఎంపీ స్థానాల్లో నోటాకు పడిన ఓట్ల పరంగా చూస్తే అరకు పార్లమెంటు రెండో స్థానంలో నిలిచినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 2019లో అరకు ఎంపీ స్థానంలో 47,977 ఓట్లు నోటాకు పోలయ్యాయి. మొత్తం పోలైన ఓట్లలో 3.5 శాతం పడటం విశేషం. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా నోటాకు భారీగానే ఓట్లు పడ్డాయి. 2014లో 4,933 ఓట్లు పోలైతే.. 2019లో 10,177 ఓట్లు పడ్డాయి. వీటిలో చాలావరకు గిరిజనులకు అవగాహన లేక వేసిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది మద్యం తాగి వచ్చి ఏదో ఒకటి నొక్కేసి వెళ్లిపోతున్నారు. మరికొందరు మాత్రం 
ఏ పాలకులు వచ్చినా మన్యానికి ఏం చేయడం లేదనే నిరాశతో నోటా మీట నొక్కి కనిపించని నిరసన వ్యక్తం చేస్తున్నారు. 


గెలుపోటములపైనా ప్రభావం..

ఈసారి ఓటింగ్‌ భారీగా జరిగినా మెజారిటీ మాత్రం 2 వేల నుంచి 5 వేల ఓట్లతో గెలిచేవారే ఎక్కువ ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆయా చోట్ల నోటాకు పడిన ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయి. 2014లో చోడవరం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు వైకాపా అభ్యర్థి కరణం ధర్మశ్రీపై 909 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అక్కడ నోటాకు 931 ఓట్లుపడ్డాయి. అభ్యర్థి మెజారిటీ కంటే నోటాకు పడిన ఓట్లే ఎక్కువ ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎలమంచిలి, అనకాపల్లిలో తక్కువ మెజారిటీతోనే వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. ఆయా నియోజకవర్గాల్లో 2,500 నుంచి మూడు వేల ఓట్లు నోటాకు పడ్డాయి. ఆ ఓట్లు తారుమారైతే ఫలితాలు మారే అవకాశం ఉండేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా నోటాకు ఎక్కువ ఓట్లు పోలైతే ఎవరి విజయవకాశాలను దెబ్బతీస్తాయోనని అందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని