logo

మత్తు.. జీవితాలు చిత్తు!!

విశాఖకు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి మద్యం తాగే అలవాటుంది. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు. కొద్దిరోజులుగా కేజీహెచ్‌లోని వ్యసన విముక్తి కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. మధ్యలో రెండు సార్లు మద్యం తాగితే ఫిట్స్‌ వచ్చింది. దీంతో భయపడి పూర్తిగా మానేయడానికి సిద్ధపడ్డారు.

Published : 24 May 2024 04:40 IST

డ్రగ్స్‌ బారిన యువత
విముక్తి కేంద్రాలకు వస్తున్నది కొందరే
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం

1. విశాఖకు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి మద్యం తాగే అలవాటుంది. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు. కొద్దిరోజులుగా కేజీహెచ్‌లోని వ్యసన విముక్తి కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. మధ్యలో రెండు సార్లు మద్యం తాగితే ఫిట్స్‌ వచ్చింది. దీంతో భయపడి పూర్తిగా మానేయడానికి సిద్ధపడ్డారు.


2. నగరానికి చెందిన బాలుడు ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కొవిడ్‌ సమయంలో ఇంట్లోనే ఉండటంతో.. గంజాయి ఎలా తీసుకోవాలని యూట్యూబ్‌లో వెతికాడు. సమీప పాన్‌షాప్‌లో దొరుకుతుందని తెలిసి..కొనుగోలు చేసి అలవాటు చేసుకున్నాడు. అబ్బాయి ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు కట్టడి చేయడానికి ప్రయత్నించారు. దీంతో ఆ బాలుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆసుపత్రిలో చేర్చారు.


3. విశాఖ నగరానికి చెందిన 30 ఏళ్ల యువకుడు సెలూన్‌ దుకాణం నడుపుతున్నాడు. కొన్నేళ్లుగా గంజాయి, మత్తు పదార్థాలు తీసుకునేవాడు. మానసిక ఆసుపత్రిలోని ఒపీయోడ్‌ సబ్‌స్టిట్యూషన్‌ సెంటర్‌ (ఓఎస్టీ)లో నాలుగేళ్లుగా చికిత్స పొందుతున్నాడు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటంతో పరిస్థితి కాస్త మెరుగుపడింది.


....పైన పేర్కొన్నవారే కాదు.. ఇలా ఎంతో మంది మత్తు పదార్థాల బారిన పడి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలతలు వస్తున్నాయి. మత్తు పదార్థాలకు బానిసైన వారికి కేజీహెచ్, ప్రభుత్వ మానసిక ఆసుపత్రుల పరిధిలోని వ్యసన విముక్తి కేంద్రాల్లో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. బాధితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.


ఔషధాలనూ వాడేస్తున్నారు: నగరంలో మద్యం, గంజాయి, డ్రగ్స్‌ తదితర మత్తుపదార్థాల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. 35-45 ఏళ్ల వయసు వారు ఎక్కువగా మద్యం బారిన పడుతున్నారు. మద్యం తాగితే వాసన వల్ల ఇంట్లో తెలిసిపోతుందనే భయంతో యువత గంజాయి, డ్రగ్స్‌ వినియోగిస్తున్నారు. పాఠశాల విద్యార్థులు కూడా గంజాయి తీసుకుంటున్నారు. శస్త్రచికిత్సల సమయంలో రోగులకు మత్తు కోసం వినియోగించే కొన్ని రకాల ఔషధాలను మత్తు కోసం కొందరు వాడుతున్నారు. ఉల్లాసానికి, నిద్రకు కొందరు డ్రగ్స్‌ వినియోగిస్తున్నారు. వివిధ రకాల ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌ వాడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.


నడవలేని స్థితిలో చికిత్సకు..

కేజీహెచ్‌లోని వ్యసన విముక్తి కేంద్రాన్ని 2020లో ఏర్పాటుచేశారు. శ్రీకాకుళం, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, పాడేరు తదితర ప్రాంతాల నుంచి రోజుకు కనీసం 10 మంది ఇక్కడికి వస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణ అవసరమైన బాధితులను ప్రభుత్వ మానసిక ఆసుపత్రికి పంపిస్తున్నారు. మానసిక ఆసుపత్రిలో 2020 జనవరిలో ఒపీయోడ్‌ సబ్‌స్టిట్యూషన్‌ సెంటర్‌ (ఓఎస్టీ) ప్రారంభించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన పలువురు ... కళ్లు, ముక్కు నుంచి నీరు కారుతూ...కడుపు నొప్పి, వివిధ అనారోగ్య సమస్యలతో ఇక్కడికి వస్తున్నారు. కొందరు వణికిపోతూ, కనీసం స్వయంగా నడవలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ప్రస్తుతం 100 మంది వరకు ఎప్పటికప్పుడు వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. మురికివాడల్లో నివసిస్తున్న కొందరు యువత ఇప్పటికీ ఆ అలవాటు నుంచి బయటకు రాలేకపోతున్నారు.


మద్యం బారిన పడిన వ్యక్తులు ఫాటీ లివర్, జాండిస్, హెపటైటిస్, గ్యాస్ట్రిక్, కిడ్నీ, కీళ్ల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థో, న్యూరో, గ్యాస్ట్రో, నెఫ్రో తదితర విభాగాల్లో చికిత్స పొందుతున్నారు. ఫిట్స్‌తో బాధపడుతున్న వ్యక్తులు మెదడుకు సంబంధించిన సమస్య అనుకుని న్యూరాలజీ విభాగానికి వెళ్తున్నారు. మద్యం వల్ల ఆ సమస్య వస్తుందని చాలా మందికి తెలియడం లేదని వైద్యులు చెబుతున్నారు.


ఉచిత చికిత్స, మందులు..

మతో పాటు, కుటుంబ సభ్యులు కూడా ఎన్నో బాధలు పడుతున్నారని గ్రహించిన  కొందరు మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ సమయంలో వణుకు, నిద్రలేమి తదితర సమస్యలు వస్తున్నాయి. డ్రగ్స్‌ వినియోగిస్తే ఏ సమస్యలు రావనే ఉద్దేశంతో మళ్లీ మొదలుపెడుతున్నారు. పూర్తిగా విసిగిపోయిన కుటుంబ సభ్యులు వ్యసనపరులను ఆయా కేంద్రాలకు తీసుకొస్తున్నారు. అక్కడి వైద్యులు, సిబ్బంది బాధితులకు వ్యక్తిగత, ఫ్యామిలీ, బృంద కౌన్సెలింగ్‌ చేపడతారు. ఉచితంగా చికిత్స చేయడంతోపాటు మందులు అందజేస్తున్నారు. చికిత్సకు వెళ్తే పోలీసులు డ్రగ్స్‌ సంబంధిత కేసు పెడతారేమోనని, పరువు పోతుందనే భయంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే..చికిత్స పొందే రోగుల వివరాలు గోప్యంగా ఉంటాయని సిబ్బంది భరోసా కల్పిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని