logo

పాదచారుల వంతెనలపై ప్రమాద ఘంటికలు

తూర్పు కోస్తా రైల్వే విశాఖ రైలు నిలయంలో నిత్యం ఏదో సమస్య తలెత్తుతూనే ఉంది. ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాల్సిన వాల్తేరు అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Published : 25 May 2024 02:10 IST

రైల్వేస్టేషన్‌లో పలు చోట్ల శిథిలం 
ఆందోళనలో ప్రయాణికులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: తూర్పు కోస్తా రైల్వే విశాఖ రైలు నిలయంలో నిత్యం ఏదో సమస్య తలెత్తుతూనే ఉంది. ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాల్సిన వాల్తేరు అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  స్టేషన్‌లో మూడు పాదచారుల వంతెనలు ఉన్నాయి. వాటిలో గేట్‌-1 ప్రధాన వంతెన 3, 4 ప్లాట్‌ఫామ్‌ల మధ్య ఏప్రిల్‌ 8న  కుంగిపోయింది. వాల్తేరు రైల్వే అధికారులు దాన్ని హుటాహుటిన తొలగించారు. వాడుకలో ఉన్న వంతెన ఒక్కసారి కుంగిపోవడానికి కారణాలపై విచారణ చేపట్టారు. అంతే కాకుండా స్టేషన్‌లో మిగిలిన వంతెనల పరిస్థితిపై తనిఖీలు నిర్వహించారు. అవి కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని అధికారులు నివేదిక సమర్పించినట్లు తెలిసింది. కొన్ని చోట్ల స్తంభాలు తుప్పుపట్టి శిథిలమైనట్లు గుర్తించారు. త్వరలో స్టేషన్‌ ఆధునికీకరణ చేపట్టనుండడంతో ఆ వంతెనలకు ప్రత్యేకంగా చేసేదేమి లేక పక్కన పెట్టినట్లు సమాచారం. కుంగిపోయిన వంతెన భాగాన్ని తొలగించడంతో పాటు పూర్తిగా మూసేశారు. దీంతో స్టేషన్‌లో మిగిలిన రెండు వంతెనలపై భారం పడి నిత్యం తీవ్ర రద్దీ నెలకొంటోంది. దీనివల్ల ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. స్టేషన్‌లో అత్యధిక రైళ్లు 3, 4 ప్లాట్‌ఫామ్‌ల నుంచి రాకపోకలు సాగిస్తుండటం.. ఆయా వంతెనలు కిక్కిరిసిపోతుండడంతో రాకపోకలు సాగించే వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక్కోసారి తోపులాట జరుగుతుండడంతో భయాందోళన చెందుతున్నారు.


ఆ వంతెన అందుబాటులోకి వచ్చేదెప్పుడో..!

కుంగిపోయి మూతపడిన వంతెనను వాల్తేరు అధికారులు ఇప్పట్లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే వంతెన మూతపడి 40 రోజులు గడిచిపోయాయి. ఇంత వరకు ఎలాంటి మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. ఈ వంతెనలో 1వ నంబరు ప్లాట్‌ఫామ్‌ నుంచి 3వ నంబరు ప్లాట్‌ఫామ్‌ వరకు పాడైనట్లు గుర్తించిన అధికారులు ఆ భాగాన్ని తొలగించి కొత్తది ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ పనులు ఎప్పడు ప్రారంభిస్తారు.. ఎప్పటికి వంతెన అందుబాటులోకి వస్తుందనే అంశంపై వాల్తేరు అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ఇప్పటికైనా వంతెన పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు