logo

అతివేగం.. తీసింది నిండుప్రాణం

సరదా ప్రయాణం విషాదాన్ని నింపింది. అచ్యుతాపురం సెజ్‌ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది.

Published : 25 May 2024 02:12 IST

యువతి మృతితో విషాదం
అచ్యుతాపురం, న్యూస్‌టుడే

రదా ప్రయాణం విషాదాన్ని నింపింది. అచ్యుతాపురం సెజ్‌ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. అచ్యుతాపురం సీఐ బుచ్చిరాజు, ఎస్సై నారాయణ కథనం ప్రకారం.. సబ్బవరం మండలం పైడివాడకు చెందిన బొబ్బరి లావణ్య (20) రాంబిల్లి మండలం హరిపాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో హోమ్‌సైన్స్‌కు సంబంధించి ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు నెలరోజుల క్రితం చేరింది. అచ్యుతాపురంలోని ప్రైవేటు వసతిగృహంలో ఉంటోంది. గురువారం రోజూ మాదిరిగా విధులకు వెళ్లి తిరిగి అచ్యుతాపురం వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో సబ్బవరానికి చెందిన గండి మురళీకృష్ణ అక్కడకు వచ్చాడు. నానమ్మకు బాగాలేదని వసతిగృహంలో చెప్పి లావణ్యను బయటకు తీసుకొచ్చాడు. అనంతరం ఇద్దరూ ద్విచక్రవాహనంపై అచ్యుతాపురం నుంచి పూడిమడక తీరంవైపు వెళ్లారు. అతివేగంగా ప్రయాణిస్తుండటంతో దుస్తుల పరిశ్రమ ఎదురుగా ఉన్న వేగనిరోధకాల వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో లావణ్య తల రోడ్డును బలంగా ఢీకొనడంతో తీవ్ర రక్తస్రావమైంది. సెజ్‌ ఉద్యోగి సతీష్‌ అందించిన సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడకు వచ్చి లావణ్యను బతికించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. అంతవరకు తనతో కలిసి ప్రయాణించి యువతి కళ్లముందే మృతి చెందడంతో మురళీకృష్ణ రోదించాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఏకైక ఆడపిల్ల అన్యాయంగా మృతి చెందిందని బాధిత కుటుంబసభ్యులు బోరుమన్నారు. లావణ్య తండ్రి అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని