logo

నిధులు కరిగిపోయి.. నిర్మాణాలు నిలిచిపోయి..

గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌లు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు, డిజిటల్‌ లైబ్రరీ వంటి నిర్మాణ పనులను ప్రభుత్వం మూడేళ్ల క్రితం గంపగుత్తగా ఒకేసారి మంజూరు చేసింది.

Updated : 25 May 2024 04:06 IST

ఏడాదిన్నరగా పడకేసిన ప్రాధాన్య పనులు
పోలింగ్‌ తర్వాత అధికార పార్టీ గుత్తేదారుల ఖాతాల్లోకి రూ. 32 కోట్లు
ఈనాడు, అనకాపల్లి న్యూస్‌టుడే, నక్కపల్లి 

గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌లు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు, డిజిటల్‌ లైబ్రరీ వంటి నిర్మాణ పనులను ప్రభుత్వం మూడేళ్ల క్రితం గంపగుత్తగా ఒకేసారి మంజూరు చేసింది. నిధుల సమస్య కారణంగా వాటిలో కొన్నింటిని ప్రాధాన్య పనులుగా గుర్తించి వాటికే బిల్లులు చేస్తూ వస్తోంది. సరిపడినంత నిధుల్లేక, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ఈ పనులు కూడా గత ఏడాదిగా నిలిచిపోయాయి. వీటి సొమ్ములను సర్కారు ఇతర అవసరాలకు మళ్లించడంతో గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేక పోయారు. వాస్తవానికి ఈ నిర్మాణాలన్నింటికీ గ్రామ, మండల స్థాయి అధికార పార్టీ నేతలే గుత్తేదారులుగా వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లు బిల్లులు ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికలు ముగిశాక తమ పార్టీ గుత్తేదారుల ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తున్నారు. పోలింగ్‌ తర్వాత అనకాపల్లి జిల్లాలో ఉపాధి హామీ బిల్లుల రూపంలో రూ. 32 కోట్లు చెల్లింపులు జరిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక అసంపూర్తి నిర్మాణాల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. 

పోలింగ్‌ తర్వాతే ఎందుకంటే.. 

ఉపాధి నిధులతో చేపట్టే వివిధ భవనాల నిర్మాణాల బిల్లుల చెల్లింపులను సర్కారే ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసినట్లు సంబంధిత శాఖలో చర్చనీయాంశం అవుతోంది. ఈ పనులన్నీ గ్రామస్థాయి వైకాపా నేతలే చేస్తున్నారు. ఎన్నికల ముందు బిల్లులు చేస్తే పార్టీని వీడి విపక్షాలతో చేరిపోతారనే భయంతో సొమ్ములివ్వకుండా ఇన్నాళ్లు తమ దగ్గరే అట్టేపెట్టుకున్నారు. ఎవరైనా పార్టీ మారితే వారికి బిల్లులు ఇచ్చే పరిస్థితి ఉండదని ముందే హెచ్చరించడంతో ఆ ఆలోచన ఉన్నవారు కూడా భయపడి అధికార పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. పోలింగ్‌ ముగియడంతో ఎవరెవరు పార్టీ కోసం పనిచేశారో ఆరా తీసి వారి ఖాతాల్లోనే తొలుత బిల్లులు జమ చేస్తున్నారు. బకాయిలు రూ. 70 కోట్ల పైబడి ఉన్నా ప్రస్తుతం రూ. 32 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన గుత్తేదారులకు మాత్రం ఇప్పటికీ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఎలమంచిలి, చోడవరం నియోజకవర్గాల్లో ఈ తరహా సమస్యలున్నట్లు తెలుస్తోంది.  

కాగితాల్లోనే పురోగతి..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయిదు విభాగాల్లో కలిపి 2,245 భవనాల నిర్మాణాలకు నాలుగేళ్ల క్రితమే పాలనాపరమైన ఆమోదం వచ్చింది. ఇందుకోసం రూ. 550 కోట్ల నిధులు అవసరం అవుతుందని అంచనా వేశారు.. మూడేళ్ల క్రితమే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు మొదలయ్యాయి. అవి పూర్తి కాకుండానే వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు, బల్క్‌మిల్క్‌ సెంటర్లు, డిజిటల్‌ లైబ్రరీ నిర్మాణాలను మొదలుపెట్టించారు. పంచాయతీరాజ్‌ శాఖతో పాటు గిరిజన సంక్షేమశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, గృహనిర్మాణ సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులకు వీటి నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. మొదట్లో సిమెంట్, ఇనుము, ఇసుక చకచకా సరఫరా చేసినా బిల్లులు చెల్లింపులో జాప్యం కారణంగా క్రమంగా నిర్మాణాలు నీరసించాయి. మంజూరైన పనుల్లో 952 పూర్తయి మరో 1,732  నిర్మాణాలు ప్రగతిలో ఉన్నట్లు అధికారులు చూపుతున్నా కాగితాల్లోనే ఆ పురోగతి కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో అంతా అసంపూర్తి నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి.


పనులు పూర్తి చేస్తాం... 

ఈ విషయమై పంచాయతీరాజ్‌ ఈఈ వీరన్నాయుడు వద్ద ప్రస్తావించగా ఇటీవల జిల్లాకు రూ.32 కోట్లు బకాయి బిల్లులు విడుదలయ్యాయని వీటితో అసంపూర్తి పనులన్నీ పూర్తవుతాయన్నారు. స్థల సమస్యలున్న చోట కొన్ని నిర్మాణాలు మొదలుపెట్టలేదు, వాటినే తగ్గించి చూపించామని చెప్పారు.


రద్దుల పద్దులో నిర్మాణాలు..

తొలుత 2,245 భవనాలు మంజూరు చేసినా వాటిలో బల్క్‌మిల్క్‌ సెంటర్లు, డిజిటల్‌ లైబ్రరీ నిర్మాణాలను మొత్తంగా పక్కనపెట్టేశారు. ప్రాధాన్య పనులుగా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలనే చేపట్టారు. ఇవి ఉమ్మడి జిల్లా మొత్తంగా 1,976 నిర్మించాల్సి ఉంది. గతేడాది వరకు ఇవన్నీ ప్రగతిలో ఉన్నట్లు చూపిన అధికారులు ఈ ఏడాదికి వచ్చేసరికి అందులో 200 భవనాలను రద్దు చేసేశారు. మొదట హెల్త్‌ క్లినిక్‌లు 547 మంజూరు చేయగా ఇప్పుడు వాటి సంఖ్యను 426కు కుదించేశారు. రైతు భరోసా కేంద్రాలు కూడా తొలుత 701 మంజూరు చేసి ఇప్పుడు 604 భవనాలకే పరిపాలనా ఆమోదం ఉన్నట్లు చూపుతున్నారు. రైతు భరోసా కేంద్రాల వ్యవస్థలో క్లస్టర్‌ విధానాన్ని తీసుకువచ్చి రెండు, మూడింటిని విలీనం చేయబోతున్నారు. అందువల్లే మంజూరైన వాటిలో కొన్నింటిని రద్దు చేసినట్లు తెలుస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని