logo

కబళించిన మృత్యువు

బోయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు, కుమార్తె తీవ్రంగా గాయపడిన ఘటన చూపరులను కన్నీరు పెట్టించింది.

Published : 25 May 2024 02:29 IST

రోడ్డు ప్రమాదంలో తల్లి దుర్మరణం, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు

ఆనందపురం, న్యూస్‌టుడే: బోయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు, కుమార్తె తీవ్రంగా గాయపడిన ఘటన చూపరులను కన్నీరు పెట్టించింది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా ఎల్‌.కోట మండలం గనివాడ గ్రామానికి చెందిన సావాళ్ల చిన్నకు భార్య నవ్య(40), ఇద్దరు సంతానం ఉన్నారు. స్థానికంగా చేపల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

కుమార్తె ఝాన్సీని ఆనందపురం మండలం బోయపాలెంలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌లో చేర్పించడానికి కుమారుడు రాజు ద్విచక్రవాహనంపై శుక్రవారం ఉదయం తల్లి, కుమార్తెలు బయలుదేరారు. పెందుర్తి వైపు నుంచి జాతీయ రహదారిపై రావడంతో ఆనందపురం కూడలి వద్ద సర్వీస్‌ రోడ్డు సదుపాయం లేక కూడలి దాటిన తర్వాత బోయపాలెం వెళ్లడానికి వేరొక రోడ్డువైపు తిరిగారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ బైకును ఢీకొనడంతో తల్లి నవ్య లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా రాజు, ఝాన్సీ తీవ్రంగా గాయపడ్డారు. వారిని తగరపువలస సమీప ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం భీమిలి ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిరుపతిరావు వెల్లడించారు. 


తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య

డాబాగార్డెన్స్, న్యూస్‌టుడే: తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య చేసుకొంది. మహారాణిపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరం జిల్లా, తెర్లాం మండలం, సింగిరెడ్డివలస గ్రామానికి చెందిన బాలిక (17) మహారాణిపేట పరిధిలోని బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైంది. విషయం తెలుసుకున్న తండ్రి కుమార్తెకు ఫోన్‌ చేసి మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన బాలిక శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాను హుక్కుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


జాతీయ రహదారిపై లారీ బోల్తా.. 

ఆనందపురం, న్యూస్‌టుడే: ఆనందపురం-అనకాపల్లి 16వ జాతీయ రహదారిపై ఓ లారీ బోల్తా పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా.. ఆనందపురం మండలం శొంఠ్యాం వద్ద తూర్పు గోదావరి జిల్లా నారాయణపురం నుంచి బిహార్‌కు చేపల లోడుతో వెళ్తున్న లారీ శుక్రవారం తెల్లవారుజామున డివైడర్‌ని ఢీకొని బోల్తా పడింది. దీంతో లారీ క్యాబిన్, చక్రాలు విడిపోయాయి. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు వెంటనే చేరుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. అతివేగం, నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు కేసు నమోదు చేశామని సీఐ తిరుపతిరావు వెల్లడించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు