logo

‘బ్యాలట్‌’తో కలిపి పోలింగ్‌ శాతం 71.2

జిల్లాలో పోస్టల్‌ బ్యాలట్‌ కలిపితే పోలింగ్‌ శాతం స్వల్పంగా పెరిగిందని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు.

Published : 25 May 2024 02:35 IST

లోక్‌సభలో 72.3 శాతం
కలెక్టర్‌ మల్లికార్జున వెల్లడి

వన్‌టౌన్, న్యూస్‌టుడే: జిల్లాలో పోస్టల్‌ బ్యాలట్‌ కలిపితే పోలింగ్‌ శాతం స్వల్పంగా పెరిగిందని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్‌ 4న ఓట్ల లెక్కింపును ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, దీనికి అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 

జిల్లాలో 20,12,373 మంది ఓటర్లు ఉంటే 70.03 శాతం అంటే 14,09,316 మంది ఈవీఎంల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. 23,981 మంది పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓట్లు వేశారని, దీంతో జిల్లా పోలింగ్‌ శాతం 71.2 శాతానికి చేరుకుందన్నారు. లోక్‌సభ పరిధిలో 13,70,484 మంది ఓటర్లు ఉంటే ఈవీఎంల్లో 71.11 శాతం మంది ఓట్లు వేశారని, పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా 22,454 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఓటింగ్‌ శాతం 72.3 శాతానికి చేరుకుందని వివరించారు.

ఏజెంట్లకు 18ఏళ్లు దాటి ఉండాలి..: ఈనెల 31వ తేదీలోపు కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను నిర్ణీత నమూనాలో అందజేయాలని కలెక్టర్‌ కోరారు. 18ఏళ్లు దాటిన వారిని మాత్రమే ఏజెంట్లుగా నియమించాలన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్నవారు అనర్హులన్నారు. ఈసీ నిబంధనలు 
కచ్చితంగా పాటించాలని, అధికారికంగా గుర్తింపు పొంది, ఐడీ కార్డులు పొందిన ఏజెంట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కావడానికి గంటన్నర ముందే చేరుకోవాలన్నారు.

ఓట్లను లెక్కించే కేంద్రాలు ఇలా..: ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఈఈఈ బ్లాక్‌ సెమినార్‌ హాలు తొలి అంతస్తు రూమ్‌ నెంబరు 4లో పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లను లెక్కిస్తామని కలెక్టర్‌ వెల్లడించారు. భీమిలి ఓట్లను న్యూ క్లాస్‌రూమ్‌ కాంప్లెక్సులోని 5,7 గదుల్లో, తూర్పు నియోజకవర్గ ఓట్లను న్యూక్లాస్‌రూమ్‌ కాంప్లెక్సులోని 9,10 గదుల్లో, దక్షిణం ఓట్లను కంప్యూటర్‌ సైన్స్‌ బ్లాక్‌లో, ఉత్తరం ఓట్లను న్యూక్లాస్‌ రూమ్‌ కాంప్లెక్సు 1,5 గదుల్లో, పశ్చిమం ఓట్లను ఇన్‌స్ట్రుమెంట్‌ టెక్నాలజీ బ్లాక్‌ సెమినార్‌ హాలు రూమ్‌ నెంబరు 3లో, గాజువాక ఓట్లను కెమికల్‌ ఇంజినీరింగ్‌ బ్లాక్‌లోని గ్రౌండ్‌ఫ్లోరు మొదటి అంతస్తులో లెక్కిస్తామన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలకు పోలైన ఓట్లను వేర్వేరుగా లెక్కిస్తామని చెప్పారు. సమావేశంలో డీఆర్వో కె.మోహన్‌కుమార్, ఆర్‌ఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని