logo

ఓట్ల లెక్కింపునకు 14 గంటలు..!

విశాఖ జిల్లాలోని ఏడు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 12 గంటల నుంచి 14గంటల సమయం పట్టే అవకాశం ఉందని యంత్రాంగం అంచనా వేస్తోంది.  జూన్‌ 4వ తేదీ ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది.

Updated : 25 May 2024 04:04 IST

మధ్యాహ్నానికి విశాఖ పశ్చిమం, దక్షిణం పూర్తి
ఆధిక్యాలు ఉదయం 9గంటల నుంచి వెల్లడి
అధికార యంత్రాంగం అంచనా
న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

విశాఖ జిల్లాలోని ఏడు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 12 గంటల నుంచి 14గంటల సమయం పట్టే అవకాశం ఉందని యంత్రాంగం అంచనా వేస్తోంది.  జూన్‌ 4వ తేదీ ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది.

తొలుత పోస్టల్‌ బ్యాలట్లను లెక్కిస్తారు. దీనికి అధిక సమయం తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. ఉదయం 8గంటలకే ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అసెంబ్లీ/లోక్‌సభ నియోజకవర్గాల వారీ అభ్యర్థుల ఆధిక్యాలు ఉదయం 9గంటల నుంచి వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈనెల 13న పోలింగ్‌ పూర్తయింది. అప్పటి నుంచి ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు పోలింగ్‌ సరళిని అంచనా వేసుకొని ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ/లోక్‌సభ ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు ఎక్కువుగా ఉన్నందున వాటి లెక్కింపునకు 10 నుంచి 12గంటల సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఏర్పాటు చేసిన బల్లలు ఇలా.. 

జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 98, లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు కలిపి 98 చొప్పున బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలట్ల లెక్కింపునకు విశాఖ ఎంపీ స్థానానికి 18 బల్లలు, మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో దానికి 3 నుంచి 5 చొప్పున బల్లలు ఏర్పాటు చేయనున్నారు.

విశాఖ లోక్‌సభకు 140 రౌండ్లు..: విశాఖ లోక్‌సభ పరిధిలోని 1962 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్లను 140 రౌండ్లలో లెక్కించనున్నారు. అదే విశాఖ జిల్లా పరిధిలోని 1991 పోలింగ్‌ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 142 రౌండ్లలో పూర్తి చేయనున్నారు.

భీమిలి ఓట్లను 26 రౌండ్లలో రాత్రి 7.30 గంటలకు, తూర్పు ఓట్లను 21 రౌండ్లలో సాయంత్రం 5 గంటలకు, దక్షిణం ఓట్లను 17 రౌండ్లలో మధ్యాహ్నం 3.30 గంటలకు, ఉత్తరం ఓట్లను 20 రౌండ్లలో సాయంత్రం 5 గంటలకు, పశ్చిమం ఓట్లను 16 రౌండ్లలో మధ్యాహ్నం 3.15 గంటలకు, గాజువాక ఓట్లను 22 రౌండ్లలో సాయంత్రం 5.45 గంటలకు, పెందుర్తి ఓట్లను 21 రౌండ్లలో సాయంత్రం 5.30 గంటలకు, లోక్‌సభ పరిధిలోని ఎస్‌.కోట ఓట్లను 19 రౌండ్లలో సాయంత్రం 4.30 గంటలకు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారని అంచనా వేస్తున్నారు.

ఒక్కో రౌండ్‌కు సుమారు అరగంట..!: లెక్కింపు సిబ్బంది తెల్లవారుజామున 4గంటలకు కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలి. తదుపరి వారికి టేబుళ్లు కేటాయిస్తారు. పోలింగ్‌ ఏజెంట్లు ఉదయం 5.30 గంటలకు రావాలి. ఉదయం 6గంటలకు ఆర్‌ఓల ఆధ్వర్యంలో స్ట్రాంగ్‌రూమ్‌లు తెరిచి పోస్టల్‌ బ్యాలట్‌ పెట్టెల సీళ్లను తెరుస్తారు. ఉదయం 8 గంటల సమయానికి స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి ఈవీఎం యంత్రాలను తీసి టేబుళ్ల మీదికి చేర్చుతారు. ఎంపిక చేసిన రెండు యంత్రాలను కేంద్ర ఎన్నికల పరిశీలకులు పరిశీలిస్తారు. 

అనంతరం అభ్యర్థుల వారీ ఒక్కో రౌండ్‌లో పోలైన ఓట్లకు సంబంధించిన పత్రాలపై ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ఈ ప్రక్రియకు 20 నిమిషాల నుంచి అరగంట పడుతుందని అంచనా వేస్తున్నారు. తదనుగుణంగా ఒక్కో నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో అధికారులు లెక్క తేల్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు