logo

నిబంధనలే అవుట్

పాయకరావుపేట నియోజకవర్గం అక్రమ లేఅవుట్లకు చిరునామాగా మారుతోంది. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల పరిధిలో పుట్టగొడుగుల్లా అక్రమ లేవుట్లు పుట్టుకొస్తున్నాయి.

Published : 26 May 2024 02:56 IST

పేటలో శ్మశాన వాటిక పక్కన వేస్తున్న లే అవుట్‌ 

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పాయకరావుపేట నియోజకవర్గం అక్రమ లేఅవుట్లకు చిరునామాగా మారుతోంది. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల పరిధిలో పుట్టగొడుగుల్లా అక్రమ లేవుట్లు పుట్టుకొస్తున్నాయి. నిబంధనలు అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం అక్రమార్కులకే వత్తాసు పలుకుతోంది. ఫలితంగా రోజుకో కొత్త లేఅవుట్‌ వెలుస్తోంది. అడ్డగోలుగా లేఅవుట్లు వేస్తున్నా, నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నా పట్టించుకునే నాథులే లేరు. ఇప్పటికే పంచాయతీ పరిధిలో స్థలాలకు సంబంధించి రికార్డులు కనిపించడం లేదు. దీంతో కొందరు పంచాయతీ స్థలాలను గుట్టుగా అమ్మకాలు చేస్తున్నారు. వీటిపై ఉన్నతాధికారులకు ఎన్ని ఫిర్యాదులు వచ్చినా తూతూమంత్రంగా దర్యాప్తుతో పక్కదారి పట్టిస్తున్నారు. తాజాగా మంగవరం రోడ్డులోని శ్మశాన వాటిక పక్కన మరో అక్రమ లేఅవుట్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనికి ఏ విధమైన అనుమతులు తీసుకోలేదు. సామాజిక అవసరాల కోసం కేటాయిస్తున్న స్థలాలను చదును చేసి ప్లాట్లుగా విభజిస్తున్నారు. అదేవిధంగా పి.ఎల్‌.పురం, సీతారాంపురం, అరట్లకోట, పాల్మన్‌పేట తదితర గ్రామాల్లోనూ అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఈ లేఅవుట్ల వల్ల అక్కడ స్థలాలు కొంటున్న వారికి ఇబ్బందులే, కాక ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు. 

దీనిపై ఈఓఆర్‌డీ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా పంచాయతీలకు లేఅవుట్లకు అనుమతి ఇచ్చే అధికారం లేదన్నారు. దీనిపై స్థల యజమానులకు, ఆయా పంచాయతీల కార్యదర్శులకు తాఖీదులు జారీ చేస్తామని చెప్పారు. అంతేగాక నిబంధనలకు విరుద్ధంగా అనుమతి జారీ చేస్తే చర్యలు తప్పవన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు