logo

అత్యుత్సాహం చూపితే అరెస్టులే

ప్రజలంతా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని ఎస్పీ కె.వి.మురళీకృష్ణ కోరారు.

Published : 26 May 2024 03:03 IST

ఎస్పీ మురళీకృష్ణ

మాట్లాడుతున్న ఎస్పీ మురళీకృష్ణ
అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ప్రజలంతా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని ఎస్పీ కె.వి.మురళీకృష్ణ కోరారు. ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో శనివారం అచ్యుతాపురంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, దీని కోసం అన్నదమ్ముల్లా ఉండాల్సిన ప్రజలు ఘర్షణలు, కొట్లాటలకు దిగడం మంచిది కాదన్నారు. జిల్లాలో పోలీస్‌ చట్టంతోపాటు 144 సెక్షన్‌ అమలులో ఉందని... ఊరేగింపులు, ర్యాలీలు, బాణసంచా పేలుళ్లు నిషేధమన్నారు. ఎవరైనా వీటిని అతిక్రమించి అత్యుత్సాహం చూపిస్తే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఒకసారి ఎన్నికల కేసులు ఇరుక్కుంటే విద్యార్థులకు ఉద్యోగాలు, పెద్దవారికి పాసుపోర్టులు సైతం రావన్నారు. పోలీసు రికార్డుల్లో పేర్లు నమోదైతే వచ్చే 30 ఏళ్లపాటు ఎన్నికలు జరిగిన ప్రతిసారి బైండోవర్‌ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి సామాన్యుడు ఒక పోలీస్‌లా పనిచేసి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని ఎస్పీ కోరారు. పల్లెల్లో ఎప్పటిలాగే అందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. లెక్కింపు కేంద్రానికి వచ్చేవారు తప్పకుండా పాసులు కలిగి ఉండాలన్నారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రికల్‌ పరికరాలకు అనుమతి లేదన్నారు. జూన్‌ 1న ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకటించే అవకాశం ఉందని, ఇతర పార్టీ నాయకుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని హెచ్చరించారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎలమంచిలి సీఐ గఫూర్, అచ్యుతాపురం సీఐ బుచ్చిరాజు, రాంబిల్లి సీఐ లక్ష్మణరావు, సబ్బవరం సీఐ రమణ, ఎస్సై నారాయణరావు తదితరులు హాజరయ్యారు. 

సమావేశానికి హాజరైన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు  

  • ఎస్పీ రాజకీయ నాయకుల అభిప్రాయాలు తెలుసుకుంటున్న సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. జనరేటర్‌ సైతం ఏర్పాటు చేయకపోవడంపై హాజరైన రాజకీయ నాయకులు విస్తుపోయారు. విద్యుత్తు సరఫరా కోసం 15 నిమిషాలుపాటు ఎస్పీ నిరీక్షించినా ఫలితం లేకపోయింది. ఆయన వేదికపై నుంచి దిగి వెళ్లిపోయాక తిరిగి విద్యుత్తు సరఫరా వచ్చింది. దీంతో విలేకరులతో మాట్లాడడానికి మళ్లీ ఆయన వెనక్కి వచ్చారు. ఇరుకు మందిరంలో సమావేశం నిర్వహించడం, బయటకు వెళ్లడానికి ఇరుకుగా ఉండే ఒకే చిన్నపాటి దారి ఉండడంతో వచ్చినవారంతా ఆందోళన చెందారు. 

పాఠశాల స్థలం కబ్జా చేస్తున్నారు 

పోలీసులు, అధికారులు ఎన్నికల విధుల్లో ఉండి గ్రామాల్లో జరిగే అన్యాయాలపై దృష్టి పెట్టకుంటే ఇబ్బందులు వస్తాయని జడ్పీటీసీ సభ్యులు నర్మాలకుమార్‌ ఎస్పీ మురళీకృష్ణ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. దోసూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు దాతలు రాసి ఇచ్చిన స్థలాన్ని కొందరు కబ్జా చేయడానికి గోతులు తీశారని ఇటువంటి సంఘటనలు పల్లెల్లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా కలవాలని ఇది, వేదిక కాదని ఎస్పీ తెలిపారు. వైకాపా, తెదేపాకు చెందిన రాజకీయ ప్రతినిధులు ఈ సమావేశంలో మాట్లాడారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని