logo

వెతలు తీరేనా..తలరాత మారేనా!

రాష్ట్రంలోని పెద్ద నగరమైన విశాఖలో ఇంటర్‌ విద్య అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వసతులు, బోధన అధ్వానంగా మారాయి.

Updated : 26 May 2024 05:39 IST

ఇంటర్‌ విద్యార్థులకు సమస్యలతో స్వాగతం

పాఠ్యపుస్తకాలు అందక అవస్థలు

ఆనందపురంలో జూనియర్‌ కళాశాలకు కేటాయించిన స్థలం 

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం, న్యూస్‌టుడే, మద్దిలపాలెం, ఆనందపురం: రాష్ట్రంలోని పెద్ద నగరమైన విశాఖలో ఇంటర్‌ విద్య అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వసతులు, బోధన అధ్వానంగా మారాయి. ఏళ్లుగా శాశ్వత అధ్యాపకుల నియామకాలు లేకపోవడంతో అతిథి, ఒప్పంద అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. ఏటికేడు ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత దిగజారుతున్నా అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఈ ఏడాది జూన్‌ 1 నుంచి జూనియర్‌ కళాశాలలు తెరచుకోనున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలోనూ విద్యార్థులకు అనేక సమస్యలు స్వాగతం పలకనున్నాయి. కళాశాలల్లో నాడు-నేడు పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరో 20 శాతం వరకు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. డిజిటలైజేషన్‌లో భాగంగా రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన టీవీలు మూలకు చేరాయి. 

  • ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పూర్తిస్థాయిలో ప్రయోగశాలలు అందుబాటులో లేకపోవడం శోచనీయం. ఈ ఏడాది విడుదలైన ఇంటర్‌ ఫలితాలు చూస్తే ప్రభుత్వ కళాశాలల పనితీరు అర్థం చేసుకోవచ్చు.

ఆ పుస్తకాలే ఆధారం: తెదేపా హయాంలో ఇంటర్‌ విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. వైకాపా హయాంలో గత మూడేళ్లుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాల సరఫరా నిలిచిపోయింది. దీంతో చదువు పూర్తయి వెళ్లిపోయే విద్యార్థుల నుంచి పుస్తకాలు తీసుకొని కొంత మందికి సర్దుతున్నారు. అలా సేకరిస్తున్న పుస్తకాలు చిరిగిపోయి, చదువుకోవడానికి వీల్లేని స్థితిలో ఉంటున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో చాలా మంది వాటితోనే నెట్టుకొస్తున్నారు. కొందరు విద్యార్థులకు చిరిగిన పుస్తకాలు కూడా అందక, బయట కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.

ఆనందపురంలో అధ్వానం: ఆనందపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నిర్మాణానికి గత తెదేపా ప్రభుత్వ హయాంలో స్థలం సేకరించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక స్థానిక ఉన్నత పాఠశాలలో రెండు గదులు కేటాయించి.. కళాశాలను ప్రారంభించారు. దీంతో వరండాలోనే తరగతులు చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రిన్సిపల్‌ సైతం వరండాలోనే కూర్చుని విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడి నుంచి రికార్డు అసిస్టెంట్‌ వరకు డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నవారే. ఇటీవల 10 మంది అతిథి అధ్యాపకులను నియమించారు. 

  • కళాశాలకు కేటాయించిన స్థలం చుట్టూ ప్రహరీ కూడా నిర్మించకపోవడంతో క్రమంగా అన్యాక్రాంతమవుతోంది. ఇక్కడ సరైన వసతులు లేకపోవడంతో స్థానిక పాఠశాలలో ఉత్తీర్ణులవుతున్న పదో తరగతి విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు వెళ్లిపోతున్నారు. గతేడాది ప్రథమ సంవత్సరంలో 12 మంది, ద్వితీయ సంవత్సరంలో ఏడుగురు విద్యార్థులు పరీక్షలు రాయగా.. ఒక్కొక్కరే ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడి బోధన, వసతులు ఎలా ఉన్నాయో ఈ ఫలితాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా  గెలుపొందిన ప్రజాప్రతినిధికి సొంత కాలేజీలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ కళాశాలపై లేకపోవడం శోచనీయమని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి.

అతిథి, కాంట్రాక్టు అధ్యాపకులతోనే..

విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న వైకాపా నాయకులు విద్యావ్యవస్థ మెరుగుపై కనీసం దృష్టి సారించలేదు. ఏప్రిల్‌లో విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో మొదటి ఏడాది ఉత్తీర్ణత 27.5 శాతం, రెండో ఏడాది 39.7 శాతం నమోదైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని కళాశాలల్లో సాధారణ కోర్సులకు సంబంధించి 199 మంది అధ్యాపకులున్నారు. వారిలో శాశ్వత అధ్యాపకులు 73 మంది మాత్రమే. కాంట్రాక్టు అధ్యాపకులు 70, అతిథి అధ్యాపకులు 56 మంది ఉన్నారు. శాశ్వత అధ్యాపకులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. వైకాపా హయాంలో వారికి సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో మరోచోట మెరుగైన అవకాశం వస్తే వెళ్లిపోతున్నారు. ఈ ప్రభావం బోధనపై పడుతోంది. వైకాపా ప్రభుత్వం పదవీ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచింది. కొన్ని కళాశాలల్లో అధ్యాపకుల పదవీ విరమణ జరిగినా.. నియామకాలు చేపట్టలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు