logo

నిర్మించి.. నిర్లక్ష్యంగా వదిలేసి..!

యువత నైపుణ్యాభివృద్ధి సాధించే దిశగా గాజువాక ప్రభుత్వ స్టీల్‌సిటీ ఐటీఐలో రూ.70 లక్షల నిధులతో నిర్మించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రానికి రెండేళ్లుగా నిర్వహణ లేక దిక్కులు చూస్తోంది.

Published : 26 May 2024 03:32 IST

నీరుగారుతున్న నైపుణ్య శిక్షణ 

 కేంద్రం ప్రారంభోత్సవంలో నాటి ఎంపీ సురేష్‌ప్రభు, తదితరులు  

యువత నైపుణ్యాభివృద్ధి సాధించే దిశగా గాజువాక ప్రభుత్వ స్టీల్‌సిటీ ఐటీఐలో రూ.70 లక్షల నిధులతో నిర్మించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రానికి రెండేళ్లుగా నిర్వహణ లేక దిక్కులు చూస్తోంది. భవనాన్ని అలంకార ప్రాయంగా వదిలేయడంపై ఔత్సాహిక నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిర్వహణకు తగిన ఆదేశాలు రాక, సిబ్బంది నియామకాలు లేక కేంద్రానికి తాళం వేసి గాలికొదిలేశారు.
న్యూస్‌టుడే, గాజువాక


ఇదీ పరిస్థితి..! 

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐటీఐ ప్రాంగణంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రానికి 2021-22లో అయిదు ఎకరాల స్థలం కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యువతకు సాంకేతిక విద్య, ఇతర నైపుణ్యాలు పెంచే దిశగా భవనాన్ని నిర్మించారు.

అలంకార ప్రాయంగా మారిన భవనం 

  • ఈ కేంద్రం ద్వారా అన్ని సాంకేతిక కళాశాలలు, శిక్షణ సంస్థలు, స్థానిక పరిశ్రమలతో అనుసంధానంగా యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. 
  • 2022 జూన్‌ ఒకటిన నైపుణ్యాభివృద్ధి కేంద్రం నిర్మాణానికి అప్పటి రాజ్యసభ సభ్యుడు సురేష్‌ప్రభు భూమి పూజ చేశారు. ఏడాది కాలంలోనే ఆధునిక వసతులతో భవన నిర్మాణం పూర్తయినా... ఇతర సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు. 
  • రాష్ట్ర వ్యాప్తంగా 148 సాధారణ కోర్సులు, 68 ప్రత్యేక కోర్సులతో సుమారు 11,280 మంది విద్యార్థులకు ఈ స్కిల్‌ హబ్‌ల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు అప్పట్లోనే ఎంపీ సురేష్‌ ప్రభు ప్రకటించారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్‌ కోర్సులు చేసే విద్యార్థులను వృత్తి నిపుణులుగా తయారు చేయడానికి ఇలాంటి కేంద్రాలు ఉపయోగపడతాయని అందరూ ఆశించగా, ఇప్పుడవి నిరుపయోగంగా మారడంపై పలువురు ఆవేేదన వ్యక్తం చేస్తున్నారు. 
  •  ఇప్పటికైనా యువతను సుశిక్షితులైన నిపుణులుగా తీర్చిదిద్దేలా కేంద్రంలో సౌకర్యాలు కల్పించి, సిబ్బందిని నియమించి, కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని