logo

జలం చాలక.. జనం వేదన

ఓ పక్కన మండుటెండలు.. ఇంకోపక్క బిందెడు నీరు దక్కించుకోవడానికి ఆపసోపాలతో పట్టణవాసులు అలసిపోతున్నారు. జిల్లాలోని అన్ని పురపాలికల్లో నీటి ఎద్దడి పెరిగింది. తాగునీటి కష్టాలు తీర్చాలంటూ ప్రజలు అధికారులు, పాలకులకు చేస్తున్న విన్నపాలకు ఫలితం ఉండటం లేదు.

Updated : 27 May 2024 05:10 IST

ఓ పక్కన మండుటెండలు.. ఇంకోపక్క బిందెడు నీరు దక్కించుకోవడానికి ఆపసోపాలతో పట్టణవాసులు అలసిపోతున్నారు. జిల్లాలోని అన్ని పురపాలికల్లో నీటి ఎద్దడి పెరిగింది. తాగునీటి కష్టాలు తీర్చాలంటూ ప్రజలు అధికారులు, పాలకులకు చేస్తున్న విన్నపాలకు ఫలితం ఉండటం లేదు. తూతూమంత్రం వేసవి కార్యాచరణ పనులు జనానికి ఉపశమనం కలిగించలేక పోతున్నాయి. 

అనకాపల్లి పట్టణం, నర్సీపట్నం, ఎలమంచిలి, న్యూస్‌టుడే : అనకాపల్లి పట్టణవాసులకు శారదానది నుంచి నీటిని తోడి రిజర్వాయర్లలో నింపి కుళాయిల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. ఉదయం వేళలో రోజుకు అరగంట నుంచి గంట వరకు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. ఇది ఎటూ చాలడం లేదు. దీనికితోడు పట్టణంలో శివారు ప్రాంతాలు విస్తరించాయి దీనికి తగ్గట్టుగా పైప్‌లైన్లు ఏర్పాటు చేయలేదు. గవరపాలెం, లక్ష్మీదేవిపేట శివారు ప్రాంతాలకు కుళాయిల నుంచి తాగునీరు అందడం లేదు. మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఒక్క అనకాపల్లి జోన్‌కు మినహాయించి మిగిలిన అన్ని జోన్లకు శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్నారు అనకాపల్లి ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో 2019లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రూ. 32 కోట్లతో అగనంపూడి నుంచి అనకాపల్లికి పైప్‌లైన్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన పదవీకాలం అయిపోతున్నా నేటికీ పనులు పూర్తికాలేదు. 12 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన పైప్‌లైన్ల పనుల్లో అలుముకున్న నిర్లక్ష్యం ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందకుండా చేసింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా, శివారు ప్రాంతాల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీటికి అందించడానికి గవరపాలెం, లక్ష్మీదేవిపేట ప్రాంతాల్లో రెండు రిజర్వాయర్‌లు నిర్మించడానికి జీవీఎంసీ తాగునీటి విభాగం అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. వీటిలో లక్ష్మీదేవిపేట రిజర్వాయర్‌కు నిధులు మంజూరైనా స్థలం సమస్య నెలకొంది. గవరపాలెం రిజర్వాయర్‌కు నిధులే మంజూరు కాలేదు. మురుగుకాలువ నుంచి వెళ్తున్న పైప్‌లైన్లు తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

పట్టణం : అనకాపల్లి 
జనాభా : లక్షకు పైగా 
నీటి సరఫరా సమయం : రోజుకు అరగంట నుంచి గంట

నీటి నిల్వల సంరక్షణకు నదిలో ఇసుక బస్తాలతో అడ్డుకట్ట  

ర్సీపట్నం మున్సిపాలిటీలో తాగునీటి వెతలు తీరడం లేదు. వేసవితో భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీలో ప్రస్తుతం రోజులో ఒకపూట.. అదీ 40 నిమిషాలపాటు మాత్రమే నీరు అందిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో కుళాయిలే లేవు. అప్పుడప్పుడు ట్యాంకర్‌ ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది వేసవి నీటి ఎద్దడి కార్యాచరణను సిద్ధం చేయడంలో అధికారులు బాగా జాప్యం చేశారు. జనం గగ్గోలుతో తాగునీటి పథకానికి సంబంధించిన ఉత్తరవాహిని నదిలో నీటి నిల్వల సంరక్షణకు ప్రవాహానికి అడ్డుగా ఇసుక బస్తాలు ఏర్పాటు చేశారు. ఒక పాత తాగునీటి బోరును బాగు చేసి చేతులు దులుపుకొన్నారు. పెరుగుతున్న జనాభాకు తగిన విధంగా ఇక్కడ నీరు సరఫరా కావడం లేదు. కుళాయిల నుంచి సన్నగా వచ్చే ధార దిక్కవుతోంది. కొన్నిచోట్ల ఈ ధార సైతం కరవవుతోంది. తరచూ పాత పథకం పైపులు పగిలిపోతుండటంతో సరఫరాకు ఎక్కడోచోట విఘాతం ఏర్పడుతోంది. ఫలితంగా కలుషిత నీటినే జనం తాగాల్సి వస్తోంది. సుబ్బారాయుడుపాలెం, రామారావుపేట తదితర ప్రాంతాల్లో కుళాయిల వద్ద ఎంత వేచి ఉన్నా నీరు రావడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • మున్సిపాలిటీలో  ఇంటింటికి ఉచిత కుళాయిల ఏర్పాటు నిమిత్తం రూ. 130 కోట్లతో చేపట్టిన పథకం పనులు మధ్యలో నిలిచి పోయాయి. పైపులు కోసం రోడ్డు పక్కన తవ్విన గోతులతో పాత పథకం తాగునీటి పైపులు పగిలిపోయాయి. వీటిని బాగు చేయకపోవడంతో సంబంధిత ప్రాంతాల్లో నిలిచిపోయిన సరఫరాతో జనం తాగునీటికి అవస్థలు పడుతున్నారు. 
  • దీనిపై మున్సిపల్‌ డీఈ నారాయణను సంప్రదించగా.. భారీ నీటి పథకం పనులకు బిల్లులు మంజూరైతే గుత్తేదారు తిరిగి పనులు ప్రారంభిస్తారని చెప్పారు. పురపాలక సంఘం పరిధిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పట్టణం : నర్సీపట్నం 
జనాభా : 64 వేలు 
నీటి సరఫరా సమయం : రోజులో 40 నిమిషాలు

తులసీనగర్‌లో బిందెలతో మహిళల ఎదురుచూపు

లమంచిలి మున్సిపాలిటీ పరిధిలో మండువేసవిలో గుక్కెడు నీరు దొరక్క ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. రోజురోజుకు సమస్య తీవ్రతరమవుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. పట్టణ పరిధిలో చాలా ప్రాంతాలకు రెండు రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఏరోజు నీరు వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియక కుళాయిల వద్ద బిందెలతో ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఎర్రవరం, పెదపల్లి, కొత్తపాలెం, కట్టుపాలెం, సోమలింగపాలెం, రామారాయుడుపాలెం, కొక్కిరాపల్లి, కొత్త ఎర్రవరం గ్రామాలున్నాయి. ఈ ప్రాంతాలకు ఎస్‌.రాయవరం మండలం సోమిదేవపల్లి వద్ద వరాహా నదిలోని బావుల నుంచి నీటిని సేకరిస్తారు. అక్కడి నుంచి ఎలమంచిలి భూగర్భ రిజర్వాయర్‌కి చేరిన ఈ నీటిని.. గ్రామాల్లో ట్యాంకులకు, అక్కడి నుంచి వీధి కుళాయిలకు అందిస్తారు. గతంలో రోజూ గంటపాటు నీళ్లు వచ్చేవి. ఇప్పుడు అరగంట రావడం కష్టంగా మారింది. పట్టణానికి ప్రధాన నీటి వనరు అయిన సోమిదేవపల్లి సంప్‌ వద్ద సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. 16 కిలోమీటర్ల పొడవున్న పైపులైన్‌కి తరచూ రంధ్రాలు పడుతుండటంతో నీటిసరఫరా నిలిచిపోతోంది. 

పట్టణం : ఎలమంచిలి
జనాభా : 40 వేలు 
నీటి సరఫరా సమయం : రెండు రోజులకొకసారి

నిబంధనల ప్రకారం నగరాల్లో ప్రజలకు సగటున ఒక్కోరికి రోజుకు 120 లీటర్లు, పట్టణాల్లో 70 లీటర్లు సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఇందులో సగం మాత్రమే సరఫరా చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని