logo

ముంపు ముప్పు.. ఇకనైనా మేల్కోరా..!

వేసవి కాలం ముగిసి వర్షాలు ప్రారంభమయ్యే నాటికి జీవీఎంసీ అధికారులు నగరంలోని గెడ్డల్లో పూడికలు తొలగించి ముంపు ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల విధుల పేరుతో ఇంజినీరింగ్‌ అధికారులు కాలం గడిపేశారు.

Published : 27 May 2024 04:38 IST

వ్యర్థాలతో నిండిపోయిన గెడ్డలు  
పూడికతీతకు జీవీఎంసీ మీనమేషాలు

జ్ఞానాపురం సమీపంలోని గెడ్డలో ప్లాస్టిక్, థర్మోకోల్‌ వ్యర్థాలు 

కార్పొరేషన్, న్యూస్‌టుడే : వేసవి కాలం ముగిసి వర్షాలు ప్రారంభమయ్యే నాటికి జీవీఎంసీ అధికారులు నగరంలోని గెడ్డల్లో పూడికలు తొలగించి ముంపు ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల విధుల పేరుతో ఇంజినీరింగ్‌ అధికారులు కాలం గడిపేశారు. దీంతో ప్రధాన గెడ్డలతోపాటు, మిగతా గెడ్డల్లోనూ వేల టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. ఓ మోస్తరు వర్షం పడినా కొన్ని ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. గత ఏడాది ఇలాంటి పరిస్థితి తలెత్తినా..ఈ ఏడాది అధికారులు ఎటువంటి నివారణ చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.

నిర్లక్ష్యం వీడకపోతే ఇదీ పరిస్థితి

భారీ వర్షం పడిన సమయంలో పోర్టు అధికారులు గేట్లను తెరవకపోతే జ్ఞానాపురం, చావలమదుం, రామకృష్ణబజారు, పూర్ణమార్కెటÂ, ఇందిర ప్రియదర్శిని స్టేడియం పరిసరాలు మునిగిపోతుంటాయి. గత ఏడాది కురిసిన వర్షానికి రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ఆయా ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరి గంటల తరబడి ప్రజలు నీటిలోనే ఉండాల్సి వచ్చింది. 96వ వార్డులోని ఏకలవ్యకాలనీ ఎప్పటికప్పుడు ముంపునకు గురవుతూ ఉంటుంది. మేహాద్రిగెడ్డకు వర్షపు నీటిని తీసుకెళ్లే గెడ్డకు పక్కనే ఈ కాలనీ ఉంది. మేహాద్రి రిజర్వాయర్‌ నిండిన తరువాత నీరంతా గెడ్డల ద్వారా విమానాశ్రయం పక్కగా సముద్రంలోకి వెళుతుంది. ఆయా గెడ్డల్లో పూడికలు తొలగించకపోవడంతో మేహాద్రి నుంచి నీరు వదిలితే నాలుగు గంటల వరకు ఏకలవ్యకాలనీ వరదలోనే ఉంటోంది. 

పొంచి ఉన్న ‘పోర్టు గేట్లు’.. 

నగరంలో ఉత్పత్తి అయ్యే వాడుక నీరంతా పాతనగరంలోని ఎర్రిగెడ్డ, గంగుల గెడ్డ, ఎస్‌ఎల్‌ కెనాల్‌ల ద్వారా సముద్రంలో  కలుస్తుంది. పోర్టు పరిధిలోని ప్రాంతం నుంచి ఆయా గెడ్డలు వెళుతున్నాయి. వ్యర్థాలతో ఉన్న నీటిని సముద్రంలోకి విడిచిపెట్టడానికి పోర్టు అధికారులు అంగీకరించడం లేదు. ఈ మేరకు ఎర్రిగెడ్డ, గంగులగెడ్డ సముద్రంలో కలిసే ప్రాంతాల్లో గేట్లను ఏర్పాటు చేశారు. వ్యర్థాల కారణంగా నౌకల రాకపోకలకు ఆటంకం కలుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు ప్రారంభమయ్యే నాటికి జీవీఎంసీ గెడ్డల్లోని వ్యర్థాలను తొలగిస్తేనే ఆయా గేట్లను పోర్టు అధికారులు తెరుస్తారు. 

 ఏటా రూ.7కోట్ల నుంచి రూ.9కోట్ల వ్యయం

ఏటా మే నెలలో నగరంలోని గెడ్డల్లో పూడిక, వ్యర్థాలను తొలగించడానికి జీవీఎంసీ కార్యాచరణ ప్రారంభిస్తుంది. దీని కోసం భారీ యంత్రాలను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ నెలరోజులకుపైగా కొనసాగుతుంది. దీనికి రూ.7 కోట్ల నుంచి రూ.9కోట్ల వరకు వెచ్చిస్తారు. ఒక్క ఏడాది ఈ ప్రక్రియ సరిగా జరగకపోయినా నగరవాసులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఎన్నికలు రావడంతో అధికారులు ఆయా పనుల్లో నిమగ్నమై పూడికతీత గురించి పట్టించుకోవడం మానేశారు. ఎవరైనా అడిగితే ఎన్నికల కోడ్‌ ఉందని చెప్పి తప్పించుకున్నారు. 

ప్రమాద ఘటనలు ఇలా..

భారీ వర్షాలు పడిన సమయంలో గతంలో ఎర్రిగెడ్డ, మల్కాపురం గెడ్డల్లో ఇద్దరు వృద్ధులు కొట్టుకుపోయి మృతి చెందారు. మద్దిలపాలెం కృష్ణా కళాశాల రోడ్డులో ఐదేళ్ల చిన్నారి కాలువలో పడి సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఐదు రోజుల తరువాత భోగాపురం తీరానికి మృతదేహం కొట్టుకొచ్చింది. ఏటా ప్రమాదకరమైన ఘటనలు చోటుచేసుకున్నా జీవీఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులు కళ్లు తెరవకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని