logo

కేజీహెచ్‌లో..రోగుల అవస్థలు

కేజీహెచ్‌లో ఆదివారం మధ్యాహ్నం గంట పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రసూతి వార్డులో శిశువులు, బాలింతలు భరించలేని ఉక్కపోతతో అల్లాడారు.

Published : 27 May 2024 04:43 IST

జనరల్‌ వార్డులో విసనకర్రతో విసురుకుంటున్న మహిళ, వెనుకనున్న మంచాల వద్ద ఇంటి నుంచి తెచ్చుకున్న ఫ్యాన్లు

ఈనాడు, విశాఖపట్నం: కేజీహెచ్‌లో ఆదివారం మధ్యాహ్నం గంట పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రసూతి వార్డులో శిశువులు, బాలింతలు భరించలేని ఉక్కపోతతో అల్లాడారు. జనరేటర్‌ ఉన్నా వినియోగించక పోవడంతో విసనకర్రలే రోగులకు దిక్కయ్యాయి. గదుల్లో పట్టపగలే చీకట్లు అలముకున్నాయి. ప్రసూతి వార్డులో ఫ్యాన్లు సరిగా పనిచేయకపోవడంతో చాలా మంది ఇంటి నుంచే టేబుల్‌ ఫ్యాన్లు తెచ్చుకున్నారు. వార్డుల్లో చివరిన ఉండే బెడ్ల వద్ద ఫ్యాన్లు లేవు. ఉన్నవి కూడా సరిగా పనిచేయకపోవడంతో ఉక్కపోత భరించలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై అధికారులు చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. 

గుండెజబ్బుల విభాగం వద్ద నీరురాని కుళాయిలు 

అధ్వానంగా శౌచాలయాలు: కేజీహెచ్‌లోని ప్రసూతి జనరల్‌ వార్డుల్లో శౌచాలయాలు అధ్వానంగా ఉన్నాయి. బాలింతలు, గర్భిణులు మరుగుదొడ్లు వినియోగించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. దుర్గంధం వెదజల్లుతోందని, పలు చోట్ల నీరు నిలిచిపోవడంతో జారిపడే ప్రమాదం ఉందని రోగుల కుటుంబీకులు వాపోతున్నారు. అధికారులు స్పందించి జనరల్‌ వార్డుల్లో సౌకర్యాలు మెరుగు పరచాలని కోరుతున్నారు. 

పనిచేయని తాగునీటి కుళాయిలు: ఆసుపత్రి ఆవరణలోని పలు విభాగాల వద్ద కుళాయిలు పని చేయట్లేదు. గుండెజబ్బుల విభాగం బయట ఉన్న నీటి కుళాయి నుంచి నీరు రావట్లేదు. దీంతో రోగులను కలిసేందుకు వచ్చేవారు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. ఆసుపత్రి బయటకు వెళ్లి నీళ్ల సీసాలు కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని