logo

రహదారిలో దర్జాగా నిర్మాణాలు

‘మీరు కట్టుకోండి.. మేం కళ్లు మూసుకుంటాం’ అన్న తీరున వ్యవహరిస్తున్నారు పట్టణ ప్రణాళికాధికారులు. ఓ వైపు వైకాపా కార్పొరేటర్ల సిఫార్సులు, మరోవైపు లంచాల మత్తు వెరసి జీవీఎంసీ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.

Published : 28 May 2024 02:11 IST

కాసులు తీసుకుని పట్టించుకోని ప్రణాళికాధికారులు
ఫిర్యాదులొస్తే నోటీసులిచ్చి హడావుడి
తిరిగి మళ్లీ నిర్మించుకోండంటూ ఉచిత సలహాలు
వైకాపా కార్పొరేటర్ల అండతో భారీగా అక్రమ కట్టడాలు

మాస్టర్‌ప్లాన్‌ రహదారిలో చేపట్టిన భారీ భవనం

‘మీరు కట్టుకోండి.. మేం కళ్లు మూసుకుంటాం’ అన్న తీరున వ్యవహరిస్తున్నారు పట్టణ ప్రణాళికాధికారులు. ఓ వైపు వైకాపా కార్పొరేటర్ల సిఫార్సులు, మరోవైపు లంచాల మత్తు వెరసి జీవీఎంసీ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అనధికార నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే అప్పటికప్పుడు కంటితుడుపుగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. తిరిగి మళ్లీ నిర్మించుకోండంటూ అక్రమార్కులకే అధికారులు ఉచిత సలహాలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ ప్రణాళికాధికారులు భారీగా వెనకేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

ఈనాడు-విశాఖపట్నం, కార్పొరేషన్‌-న్యూస్‌టుడే

నిర్మాణంపై ఫిర్యాదులు రావడంతో పని నిలిపివేయాలని నోటీసులు జారీ చేస్తూనే, మరో పక్క నిర్మాణం చేసుకోండని నిర్మాణదారులకు ప్రణాళికాధికారులు చెప్పినట్లు ఆరోపణలున్నాయి. రహదారి స్థలాన్ని ఆక్రమించినా, చర్యలు తీసుకోకుండా ఉండేలా సహాయ ప్రణాళికాధికారి భారీగానే ముడుపులు తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిర్మాణానికి ఆనుకుని, మరో భారీ నిర్మాణానికి పునాదులు పూర్తి చేసి, పిల్లర్లు వేసే పనులు చేపడుతున్నారు. దాన్ని నిలుపుదల చేయాల్సిన ప్రణాళికాధికారులు కావాలనే తాత్సారం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణాలు పూర్తయితే, భవిష్యత్తులో రహదారి విస్తరణ జరగదు. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరిగినా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి.

పనులు నిలిపిన భవనం పక్కనే మరో భవన నిర్మాణ పనులు

హవ్వ.. విస్తరణ రహదారిపై నిర్మాణాలా?

నగరంలోని జోన్‌-2 పరిధిలోని ఏడవ వార్డు జాతీయ రహదారికి ఆనుకుని దుర్గానగర్‌ రహదారిలో చేపడుతున్న భారీ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంది. ప్రస్తుతం 30 అడుగుల రహదారిగా ఉన్నప్పటికీ, త్వరలో దానిని 40 అడుగుల రహదారిగా విస్తరించడానికి రహదారి అభివృద్ధి ప్రణాళిక సైతం సిద్ధమైంది. నిర్మాణదారు 40 అడుగుల రహదారిని దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా పూర్తిగా రహదారి స్థలాన్ని ఆక్రమించేస్తున్నారు. నాలుగు అంతస్తుల్ని నిర్మాణదారు ఇప్పటి వరకు పూర్తి చేసినా, ప్రణాళికాధికారులు గుర్తించకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి.

జ్యోతినగర్‌లో సెల్లార్‌ మూసేస్తూ అక్రమ నిర్మాణం

పట్టణ ప్రణాళికలో వసూల్‌ రాజాలు!

జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంలో సహాయ ప్రణాళికాధికారులుగా విధులు నిర్వహిస్తున్నవారు నిర్మాణదారులతో కుమ్మక్కవుతూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. కొంత మంది సహాయ ప్రణాళికాధికారులు నేరుగా బేరాలు కుదుర్చుకుంటుండగా, మరికొంత మంది దిగువ స్థాయి సిబ్బందిని వినియోగించుకుంటున్నారు. జోన్‌-2 పరిధిలోని ఓ అధికారి మున్సిపల్‌ శాఖ మంత్రికి చెందిన వ్యక్తిగా ప్రచారం చేసుకున్నారు. ఇంకేముంది? ఆయనపై ఆరోపణలొచ్చినా, ఉన్నతాధికారులు సైతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జోన్‌-3లో అనేక అక్రమాలు జరుగుతుండగా, పాలకవర్గం సభ్యులను దన్నుగా చేసుకుని, ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారన్న విమర్శలున్నాయి. జోన్‌-4, జోన్‌-5లలో సహాయ ప్రణాళికాధికారి చేయాల్సిన పనులను ఆ తరువాత స్థానంలో ఉన్న అధికారులే చేస్తుండటం, వారే నేరుగా భవన నిర్మాణదారుల నుంచి డబ్బులు వసూళ్లు చేసి అప్పగిస్తున్నట్లు విమర్శలున్నాయి. పత్రికల్లో వార్తలు, కథనాలు వచ్చినా, కనీసం స్పందించకపోవడానికి ఏసీపీల వెనుక అధికారులుండటమే అన్న వాదన వినిపిస్తుంది.

తెలిసినా తెలియనట్లే..

జోన్‌-4లో 29వ వార్డులో అదనంగా రెండు అంతస్తులు వేసిన నిర్మాణం వైపు కన్నెత్తి చూడకపోవడం, కనీసం నోటీసులు కూడా జారీ చేయకపోవడం వెనుక సహాయ ప్రణాళికాధికారికి భారీగా నగదు ముట్టినట్లు ఆరోపణలున్నాయి. జోన్‌-5 పరిధిలో 54వ వార్డు జ్యోతినగర్‌లో సెటబ్యాక్‌లు విడిచిపెట్టకుండా, నిర్మాణ స్థలానికి సరైన పత్రాల్లేకుండా ప్లానుకు విరుద్ధంగా అదనపు అంతస్తులు వేశారు. దీనిపై సహాయ ప్రణాళికాధికారిని వివరణ కోరగా, పరిశీలిస్తామని పేర్కొనడం విశేషం. విచిత్రమేంటంటే ప్లానులో సెల్లారు చూపిన నిర్మాణదారు, ప్రస్తుతం దానిని మూసేసినా ప్రణాళికాధికారులు పట్టించుకోవడం లేదు. దీని వెనుక అధికార పార్గీ కార్పొరేటర్‌తో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని