logo

మద్యం విక్రయం.. నగదు రహితం

మద్యం విక్రయాల్లో ‘నవ్విపోదురు గాక నాకేంటి?’ అన్న చందంగా ఉంది ప్రభుత్వ తీరు. నిన్నటి వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఫోన్‌-పే, గూగుల్‌-పేలతో వెళితే మద్యం అమ్మేవారు కాదు.

Updated : 28 May 2024 09:24 IST

డిజిటల్‌ పేమెంట్ల దిశగా అడుగులు
కూలీలు, పేదలకు తప్పని భారం
ఐదేళ్లుగా ఏమాయ చేశారో..
ఈనాడు - విశాఖపట్నం

మద్యం విక్రయాల్లో ‘నవ్విపోదురు గాక నాకేంటి?’ అన్న చందంగా ఉంది ప్రభుత్వ తీరు. నిన్నటి వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఫోన్‌-పే, గూగుల్‌-పేలతో వెళితే మద్యం అమ్మేవారు కాదు. నగదు రూపంలో చెల్లిస్తేనే మద్యం ఇచ్చేవారు. డిజిటల్‌ పేమెంట్లు జరపకుండా నగదును పక్కదారి పట్టిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించినా చీమ కుట్టినట్లైనా స్పందించలేదు. ఇప్పుడేమో పాలసీ ఒక్కసారిగా మారిపోయింది. వైన్‌ షాపుల్లో ‘నో క్యాష్‌’ అంటున్నారు. డిజిటల్‌ పేమెంట్లు చేస్తేనే మద్యం ఇస్తామంటూ ఉద్యోగులు, సిబ్బంది చెబుతున్నారు. అకస్మాత్తుగా వచ్చిన మార్పులతో కూలీలు, పేదలు ఖంగుతింటున్నారు. ఇదంతా ఆయా ప్రాంతాల్లోని బార్లకు మేలు చేసేలా ఉంది తప్పితే, ప్రభుత్వ ఆదాయం పెంచేలా లేదన్న విమర్శలున్నాయి.

అంతా మా ఇష్టం...: విశాఖ పార్లమెంట్‌ పరిధిలో (ఎస్‌.కోట మినహా) 139 ప్రభుత్వ మద్యం దుకాణాలున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం షాపుల్లో నగదు రూపంలో డబ్బులు చెల్లిస్తేనే మద్యం ఇచ్చేవారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగియగానే ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 70శాతం డిజిటల్‌ పేమెంట్లు ఉండాలంటూ షాపులకు తొలుత మౌఖిక ఆదేశాలొచ్చాయి. గత కొన్ని రోజులుగా ప్రతి షాపులో 200-400 వరకు డిజిటల్‌ పేమెంట్లు ఉండాలని ఒత్తిడి పెంచారు. క్యాష్‌ పేమెంట్లు తీసుకోవద్దని తేల్చి చెప్పేశారు. దీంతో మద్యం షాపుల్లో ఉద్యోగులు 200 డిజిటల్‌ పేమెంట్ల లక్ష్యం పూర్తి చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఒక్కసారిగా మారిన పాలసీతో ఫోన్‌-పేలు ఉపయోగించని పేద, వృద్ధులు మద్యం దుకాణాల వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ప్రతి నెలా రూ.150-190 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో చీప్‌ లిక్కర్‌ 80శాతం వాటా విక్రయాలుంటాయి. చీప్‌ లిక్కర్‌ కొనుగోలు చేసే కార్మికులు, మత్స్యకారులు, పేదలకు యూపీఐ సేవలు చాలావరకు లేవు.

ఇన్ని రోజులు మౌనంగా ఉండి, ఇప్పుడు నగదు రహిత సేవలంటూ ఇలాంటి వారందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. క్రమంగా అలవాటు చేయాల్సి ఉన్నా కొత్త ప్రభుత్వం కొలువు దీరే సమయంలో ఇలా చేయడంపై మద్యం ప్రియులు మండి పడుతున్నారు. చేసేది లేక పక్కవారిపై ఆధారపడటంతో... ఫోన్‌పే, ఇతర మార్గాల్లో చెల్లింపులు చేసినందుకు రూ.10 కమీషనుగా గుంజుతున్నారు.

ఇన్నాళ్లూ పారదర్శకతకు పాతరేసినట్లేనా?

దశల వారీగా మద్యపాన నిషేధం అంటూ వైకాపా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పింది. మద్యం తయారీ, విక్రయాలు గుప్పిట్లో పెట్టుకుని అంతా తామై ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారు. మద్యం సరఫరా నుంచి విక్రయాల వరకు భారీ అక్రమాలే జరిగాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డబ్బులు తీసుకున్నారు. ఈ సమయంలో క్రయవిక్రయాల్లో ఇష్టానుసారం వ్యవహరించారు. ఓ వైపు మద్యం దోపిడీ చేస్తున్నారంటూ, కల్తీ మద్యం అమ్మకాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల బార్‌లకు మేలు చేసేందుకు, సమీపంలోని ప్రభుత్వ దుకాణాల్లో బ్రాండ్లు పెట్టకుండా, దుకాణాలు వెంటనే మూసివేస్తూ సహకరించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. అంటే ఇప్పుడు సాధ్యమైన నగదు రహిత లావాదేవీలు, వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎందుకు సాధ్యం కాలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో దుకాణాల నుంచి డబ్బులను సీఎఫ్‌ఎంఎస్‌కు చలానా తీసేవారు. ఇప్పుడు డిజిటల్‌ పేమెంట్ల ద్వారా ఈ నగదు ఖజానాలో జమ అవుతుందా? లేక ఇంకెక్కడికైనా వెళుతుందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని