logo

పల్లెలకు పాకిన విష సంస్కృతి

బ్లేడ్‌ బ్యాచ్‌ సంస్కృతి పల్లెలకు విస్తరించింది. యువతిని వేధించొద్దని వారించిన వ్యక్తిపై గంజాయి మత్తులో ఉన్న ఒకరు బ్లేడ్‌తో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన దిబ్బపాలెం సెజ్‌ కాలనీ సమీపంలో సోమవారం జరిగింది.

Updated : 28 May 2024 06:38 IST

గంజాయి మత్తులో బ్లేడ్‌తో దాడి

గాయపడిన రాంబాబు

రాంబిల్లి, అచ్యుతాపురం, న్యూస్‌టుడే: బ్లేడ్‌ బ్యాచ్‌ సంస్కృతి పల్లెలకు విస్తరించింది. యువతిని వేధించొద్దని వారించిన వ్యక్తిపై గంజాయి మత్తులో ఉన్న ఒకరు బ్లేడ్‌తో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన దిబ్బపాలెం సెజ్‌ కాలనీ సమీపంలో సోమవారం జరిగింది. రాంబిల్లి సీఐ లక్ష్మణరావు కథనం ప్రకారం.. అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్‌ కాలనీకి చెందిన లాలం శ్రీను గంజాయి మత్తులో రోడ్డుపై వెళ్తున్న యువతిని వేధించాడు.  ఇది చూసిన ఇదే కాలనీకి చెందిన రెడ్డి రాంబాబు వారించే ప్రయత్నం చేశాడు. మత్తులో ఉన్న శ్రీను తన వద్ద ఉన్న బ్లేడ్‌తో రాంబాబుని తీవ్రంగా గాయపరిచాడు. రాంబాబు తప్పించుకోవడానికి ప్రయత్నించినా వదలకుండా మెడ, చేతులు, ముఖంపై తీవ్రంగా గాయపరిచాడు. రాంబాబు కేకలు వేయడంతో స్థానికులు స్పందించి శ్రీను నుంచి ఇతనిని రక్షించారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలకు చెందిన పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దాడికి పాల్పడిన లాలం శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎన్నడూలేని ఇటువంటి సంఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

నిందితుడు శ్రీను 

పోలీసులే బాధ్యత వహించాలి.... దిబ్బపాలెంసెజ్‌ కాలనీకి గంజాయి విక్రయాలకే కేంద్రంగా మారిపోయిందని కాలనీ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ బైలపూడి రాందాసు ఆందోళన వ్యక్తంచేశారు. రాంబాబుపై దాడిచేసిన లాలం శ్రీను గంజాయి మత్తులో ఈదాడికి పాల్పడ్డాడన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు గంజాయి విక్రయిస్తున్నారన్నారు. గంజాయి మత్తులో ఆరుబయట నిద్రించే మహిళల మెడలో బంగారు వస్తువులను లాక్కొని పోతున్నారని రాందాసు ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి పోలీసుల ఉదాసీనతే ప్రధాన కారణమని ఆయన మండిపడ్డారు. గంజాయి మూలాలను తెలుసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారన్నారు. శ్రీనుకు గంజాయి ఎక్కడ నుంచి వచ్చిందో విచారించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని