logo

అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌పై విచారణ జరిపించాలి: విదసం

అసైన్డ్‌ భూముల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని విశాఖ జిల్లా దళిత సంఘాల సమాఖ్య ఐక్య వేదిక (విదసం) రాష్ట్ర కన్వీనరు బూసి వెంకటరావు డిమాండ్‌ చేశారు.

Published : 28 May 2024 02:01 IST

కలెక్టరేట్‌ వద్ద ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న విదసం సభ్యులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: అసైన్డ్‌ భూముల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని విశాఖ జిల్లా దళిత సంఘాల సమాఖ్య ఐక్య వేదిక (విదసం) రాష్ట్ర కన్వీనరు బూసి వెంకటరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ వద్ద విదసం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. 596 జీఓ ప్రకారం రిజిస్టర్‌ అయిన అసైన్డ్‌ భూముల బదలాయింపులను తక్షణమే నిలిపివేయాలన్నారు. విజయనగరం జిల్లాలో వెలుగు చూసిన అక్రమాలపై గవర్నర్, భూ పరిపాలన వ్యవహారాల ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశామన్నారు. ఇదే తరహాలో భీమిలి రెవెన్యూ డివిజన్‌ పరిధి ఆనందపురం, పద్మనాభం మండలాల్లో 22ఎ ప్రకారం డీనోటిఫై అయిన 329.53 ఎకరాల అసైన్డ్‌ భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, వీటిపై కూడా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. విచారణ జరిగే వరకు కొనుగోలుదారులకు భూ బదలాయింపు ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కొందరు పెద్దలు డీనోటిఫికేషన్‌ అంశాన్ని దాచిపెట్టి రైతుల నుంచి నాలుగో వంతు ధరకు భూములు కొట్టేశారన్నారు. ఇది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నేరాల పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నందున తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్నారు. కలెక్టరేట్‌లో ఇచ్చిన ఫిర్యాదు ప్రతిని గవర్నర్, సీసీఎల్‌ఏకు పంపామని వెంకటరావు వివరించారు. విదసం ప్రతినిధులు సోడాదాసి సుధాకర్, ఈతలపాక సుజాత, హరిబాబు, గుడివాడ ప్రసాద్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు