logo

రూ. కోట్ల బాటలో.. ఆశల పల్లకి!!

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బుధవారం ప్రవేశ పెట్టిన 2023-2024 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ అన్ని వర్గాల్లో ఆశలు నింపింది. ‘మౌలిక’ రంగానికి కేటాయింపుల వల్ల వివిధ కేంద్ర సంస్థలున్న విశాఖకు ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Updated : 02 Feb 2023 09:45 IST

ఈనాడు, విశాఖపట్నం

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బుధవారం ప్రవేశ పెట్టిన 2023-2024 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ అన్ని వర్గాల్లో ఆశలు నింపింది. ‘మౌలిక’ రంగానికి కేటాయింపుల వల్ల వివిధ కేంద్ర సంస్థలున్న విశాఖకు ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. పర్యాటక పరంగానూ ఎంతో ప్రయోజనం కలిగే అవకాశం ఉందంటున్నారు.

విశాఖ ఉక్కుకు నిధులు తగ్గించేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ అంశంపై మంత్రి ఎటువంటి ప్రకటన చేయలేదు. రైల్వే బడ్జెట్‌కు సంబంధించిన అంశాలు రెండు రోజుల్లో వెల్లడవనున్న నేపథ్యంలో జోన్‌కు ఏ మేరకు కేటాయింపులు జరిగాయో స్పష్టత రానుంది.


సంస్థ: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎనర్జీ (ఐఐపీఈ)
కేటాయింపు: రూ.168 కోట్లు
ప్రయోజనం: కేంద్ర సాయంతో వర్సిటీ కార్యకలాపాల విస్తరణ, పరిశోధనల పెంపునకు ఉపయోగపడుతుంది. గతంలో వంద కోట్లు మాత్రమే కేటాయించారు. వర్సిటీ ప్రారంభ ఏడాది కేవలం రూ.23 కోట్లు కేటాయింపులు జరిగాయి. తాజాగా బడ్జెట్‌ను పెంచడంతో పూర్తిస్థాయిలో భవనాల నిర్మాణం, కోర్సుల నిర్వహణ, పరిశోధనలకు ఊతమిచ్చినట్లే.


అలా... తగ్గించేశారు

విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తారన్న ఆందోళనలు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై వెనకడుగు వేయకపోగా ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మరో వైపు ప్రైవేటీకరణ చర్యలను అడ్డుకుంటామని కార్మికులు ఉద్యమిస్తున్నారు. ఈ తరుణంలో తాజా బడ్జెట్‌లో కేటాయింపులను రూ. 683 కోట్లకు పరిమితం చేశారు. గత ఆర్థిక సంవత్సరం కన్నా తగ్గించడంపై కార్మికుల నుంచి మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.  గత బడ్జెట్‌లో రూ.910 కోట్లు కేటాయించగా రూ.603 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. ఆ మేరకు మాత్రమే ఈసారి అంచనాలు తయారు చేసినట్లు తెలుస్తోంది.


విభాగం: మౌలికవసతులు, రవాణా
ప్రయోజనం: పట్టణ మౌలిక, రవాణా వసతుల కల్పనకు ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించడంతో విశాఖలో వసతుల మెరుగుకు అవకాశం కలగనుంది. ఇక్కడ పలు కేంద్ర సంస్థలు ఉన్న నేపథ్యంలో వసతుల పెంపునకు నిధులు రావొచ్చంటున్నారు. ఆకర్షణీయ నగరాల అభివృద్ధి విభాగంలో నిధులు వచ్చే అవకాశం ఉంది.


విభాగం: పర్యాటకశాఖ
ప్రయోజనం: సమీకృత పర్యాటక అభివృద్ధి పథకం కింద స్వదేశీ దర్శన్‌ వంటి పథకాల కోసం భారీగా నిధులు కేటాయించారు. ఈ నేపథ్యంలో విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలను కలిపి ‘టూరిజం సర్క్యూట్‌’లను ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అరకు-లంబసింగి సర్క్యూట్‌కు ప్రతిపాదనలు వెళ్లిన నేపథ్యంలో నిధుల మంజూరయ్యే అవకాశం ఉంటుందంటున్నారు.

* దర్శన్‌ టూర్‌ కింద దేశంలోని 50 ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేయనున్నారు. ఇందులో విశాఖకు తగిన గుర్తింపు ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.


సంస్థ: విశాఖ పోర్టు ట్రస్టు
కేటాయింపు: రూ.337 కోట్లు
ప్రయోజనం: గతం కన్నా ఈసారి విశాఖ పోర్టుకు రూ.180 కోట్ల వరకు అదనంగా కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.155, అంతకుముందు ఏడాదిలో రూ.237 కోట్లు ఇచ్చారు. నిధుల పెంపుతో పోర్టు నిర్వహణ మరింత మెరుగయ్యే అవకాశం ఉంది.


విభాగం: జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా
ప్రయోజనం: ఈ విభాగానికి దేశ వ్యాప్తంగా రూ.780 కోట్లు కేటాయించిన నేపథ్యంలో విశాఖలోని కేంద్రానికీ భారీగానే నిధులు రావొచ్చు. ఫలితంగా సాగర గర్భ పరిశోధనలకు మరింతగా వీలు కలుగుతుంది.


అంశం: పీఎం ఆవాస్‌ యోజన
ప్రయోజనం: కేంద్రం ఈ బడ్జెట్‌లో పీఎం ఆవాస్‌ యోజనకు దాదాపు రూ.79 వేల కోట్లు కేటాయించిన నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ప్రస్తుతం లక్ష ఇళ్ల వరకు కేంద్ర ప్రభుత్వ సాయానికి ప్రతిపాదించగా వీటిల్లో కొన్ని ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. తాజా నిధుల కేటాయింపుతో గృహాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


సంస్థ: ఇండియన్‌ మారిటైం యూనివర్సిటీ
ప్రయోజనం: ఈ వర్సిటీలకు కేంద్రం రూ.87 కోట్లు కేటాయించారు. ఇందులో కొంత మేరకు విశాఖలోని మారిటైం యూనివర్సిటీకి దక్కనుంది.


మత్స్యశాఖకు ఆశాజనకంగా...

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో మత్స్యశాఖకు రూ.6వేల కోట్ల నిధులు కేటాయించడంతో జిల్లాలో మత్స్యశాఖ పరంగా చేపట్టే కార్యక్రమాలకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.152కోట్లతో చేపలరేవు నవీకరణ చేపట్టారు. ఇటీవల ఆయా పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. డీపీఆర్‌ (సవివర పథక నివేదిక) సిద్ధం కావడంతో టెండర్లు కూడా పిలిచారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత బడ్జెట్‌లో నిధులు పెరగడం వల్ల నవీకరణ ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని ఆయా వర్గాలు భావిస్తున్నాయి.


పోరాడుతున్నా.. కేటాయింపులేవీ: కేంద్ర బడ్జెట్‌ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉన్నప్పటికీ... రాష్ట్రానికి ఎప్పటిలానే తీవ్ర అన్యాయం జరిగింది. గతం నుంచి పోరాడుతున్నా ప్రాధాన్యంగా ఎటువంటి కేటాయింపులు జరగకపోవడం నిరాశ కలిగించింది.  ప్రత్యేక హోదాకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌ నిధులపైనా స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశాలపై పార్లమెంటులో తగిన విధంగా పోరాడుతాం. ఆదాయపన్ను పరిమితి పెంపు, మౌలికవసతుల అభివృద్ధికి నిధుల కేటాయింపు వంటివి బాగున్నాయి.

ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ ఎంపీ


ప్రగతికి ఊతమిచ్చేలా ఉంది: సీఐఐ

సమావేశంలో మాట్లాడుతున్న సీఐఐ ఛైర్మన్‌ నీరజ్‌ సర్దా

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ‘దేశ ప్రగతికి ఇది అనుకూల బడ్జెట్‌’ అని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) రాష్ట్ర ఛైర్మన్‌ నీరజ్‌ సర్దా అన్నారు. బడ్జెట్‌పై విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘మౌలిక వసతులకు పెద్ద పీట వేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేలా కేటాయింపులున్నాయి’ అని వ్యాఖ్యానించారు. విజయ్‌నగర్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు డి.తిరుపతి రాజు మాట్లాడుతూ ‘వ్యక్తిగత ఆదాయపు పన్నుపై తీసుకున్న నిర్ణయం ఊరటనిచ్చే అంశం. పరిశ్రమల పన్ను విధానంలోనూ మార్పులు తెచ్చి ఉంటే బాగుండేది’ అన్నారు. వీ లిఫ్ట్‌ టెక్నాలజీస్‌ సీఈవో ఫణీంధ్ర మాట్లాడుతూ అంకుర సంస్థల పరంగా బడ్జెట్‌ చాలా బాగుందన్నారు. చీఫ్‌ ఫైనాన్స్‌ కన్సల్టెంట్‌ లలితా సుందరి మాట్లాడుతూ యువత నైపుణ్య అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. సీఐఐ మాజీ ఛైర్మన్‌ వర్మ, పాట్రా ఇండియా బీపీఓ సర్వీసెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎమ్‌.లక్ష్మి ప్రసాద్‌,  ఆర్‌ఎస్‌ బిల్డర్స్‌ ఆండ్‌ డెవలపర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పాట్నర్‌ పి ప్రదీప్‌, గ్రీన్‌ జామ్స్‌ సీఈవో జె. వరుణ్‌ తదితరులు మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని