logo

‘జీ20’ అతిథులు మెచ్చేలా..!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన జీ20 సన్నాహక సదస్సుల్లో పాల్గొనేందుకు స్వదేశీ, విదేశీ ప్రతినిధుల రాక మొదలైంది. కొందరు ఆదివారం విశాఖ చేరుకున్నారు.

Published : 27 Mar 2023 03:55 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే

బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన సౌర వృక్షం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన జీ20 సన్నాహక సదస్సుల్లో పాల్గొనేందుకు స్వదేశీ, విదేశీ ప్రతినిధుల రాక మొదలైంది. కొందరు ఆదివారం విశాఖ చేరుకున్నారు. సోమవారం 40 మంది వరకు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన వారు 28వ తేదీ ఉదయానికి చేరుకోనున్నారు. సదస్సుల్లో పాల్గొనే దేశ, విదేశీ అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేస్తోంది. నగరంలో వారు అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి స్వస్థలాలకు వెళ్లే వరకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టింది. సదస్సుల నిర్వహణకు జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున 18 కమిటీలు ఏర్పాటు చేశారు.

* అతిథులు, ప్రముఖులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కొలువుదీరే వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ పర్యవేక్షిస్తున్నారు. నగర సుందరీకరణ పనుల బాధ్యతను జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబుకు అప్పగించారు. వేదిక వద్ద ఏర్పాట్లను రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

సిద్ధంగా 300 వాహనాలు

* 98 మంది లైజాన్‌ అధికారులు విదేశీ అతిథులకు అవసరమైన సేవలందిస్తారు. ప్రొటోకాల్‌ బాధ్యతలను డీఆర్వో, ఆర్డీఓ, డీటీసీలకు అప్పగించారు. దాదాపు 300 వాహనాలను అతిథుల కోసం సిద్ధం చేస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 29 లేదా 30న అతిథులు నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. ఆయా ప్రదేశాల వద్ద యంత్రాంగం పక్కాగా ఏర్పాట్లు చేసింది.

* రాష్ట్ర గవర్నర్‌ నజీర్‌ ఈనెల 28వ తేదీ సాయంత్రం విశాఖ చేరుకొని రాత్రికి గవర్నర్‌ బంగ్లాలో బస చేయనున్నారు. 29న తిరుగు ప్రయాణం కానున్నారు. కేంద్ర మంత్రుల పర్యటనల పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. మరికొందరు రాష్ట్రమంత్రులు ఈనెల 28 నాటికి విశాఖ చేరుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు వస్తున్నారు.


28న సీఎం జగన్‌ రాక

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 28వ తేదీ సాయంత్రం 5.15గంటలకు ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాడిసన్‌ బ్లూ హోటల్‌కు వెళతారు. అక్కడ జీ20 అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గలా డిన్నర్‌లో పాల్గొంటారు. రాష్ట్రంలో చేపట్టిన పలు సంక్షేమ పథకాలపై సీఎం ప్రసంగిస్తారు. రాత్రి 8గంటలకు రాడిసన్‌ బ్లూ హోటల్‌ నుంచి బయలుదేరి 8.30గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. 8.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని