logo

రూ. కోట్లొచ్చాయ్‌... కుమ్మరించారు!!

విశాఖ నగరానికి ‘జి-20’ సన్నాహక సదస్సుల పుణ్యమా అని భారీగా నిధులొచ్చాయి. ఇంకేముంది నగర దారులు, మౌలిక వసతులు బాగుపడతాయని ప్రజలు భావించారు. జనం ఒకటి అనుకుంటే... జరిగింది ఇంకొకటి.

Updated : 31 Mar 2023 10:57 IST

తాత్కాలిక పనులకే భారీగా వ్యయం
టెండర్లు లేకుండా కట్టబెట్టిన వైనం!
అధికారుల తీరుపై అనుమానాలెన్నో!!

సీతకొండపై బొమ్మలు

ఈనాడు-విశాఖపట్నం, కార్పొరేషన్‌-న్యూస్‌టుడే: విశాఖ నగరానికి ‘జి-20’ సన్నాహక సదస్సుల పుణ్యమా అని భారీగా నిధులొచ్చాయి. ఇంకేముంది నగర దారులు, మౌలిక వసతులు బాగుపడతాయని ప్రజలు భావించారు. జనం ఒకటి అనుకుంటే... జరిగింది ఇంకొకటి.

కొన్ని పనుల తీరు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. తాత్కాలిక అంశాలకూ భారీగా సొమ్ములు కుమ్మరించారు. ఇదెక్కడి చిత్రమంటూ నగరవాసులు విస్తుపోతున్నారు. ఇదేనా సుందరీకరణ అంటూ విమర్శిస్తున్నారు. శాశ్వత పనులకు కాకుండా... తేలిపోయే రంగులు, వాడిపోయే పూల మొక్కలు, తాత్కాలిక విద్యుద్దీపాల అలంకరణలకే నిధులు భారీగా ఖర్చు చేశారు. జీ20’ పేరుతో దాదాపు 420 పనులు చేపట్టారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పర్యాటకశాఖలు సంయుక్తంగా దాదాపు రూ.150 కోట్లు వ్యయం చేసినట్లు అంచనా.

రంగులద్ది..

జి-20 సన్నాహక సమావేశాల నేపథ్యంలో షీలానగర్‌ నుంచి మద్దిలపాలెం వరకు రహదారిపై డివైడర్ల గ్రిల్స్‌కు రంగులు వేసేందుకు రూ.3.20 కోట్లు కేటాయించారు. బీచ్‌ రోడ్డులోని తెన్నేటి పార్కు, సీతకొండల వద్ద పెయింటింగ్‌ పనులు సాగాయి. ఈ రెండు చోట్లా సాధారణ రంగులద్దడానికి రూ.30లక్షలతో టెండర్లు పిలిచి కేవలం రూ.5లక్షల పనులు చేసి చేతులు దులిపేసుకున్నట్లు విమర్శలున్నాయి. నగరంలో మిగిలిన ప్రాంతాల్లో మీటరుకు రూ.500 ఖర్చు చేసిన జీవీఎంసీ.. తెన్నేటి పార్కు వద్ద మీటరుకు రూ.1.50 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తుండటం గమనార్హం. ఇలా ఈ ఒక్క పార్కు వద్దనే రూ.12 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పులి తల, సింహం బొమ్మల ఖర్చు రూ.లక్షన్నరగా చెప్పగా నగరంలో పేరున్న ఆర్టిస్టులు, పెయింటర్‌లే ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు సీతకొండ వద్ద కేవలం 5 బొమ్మల ఖరీదు రూ.16లక్షలుగా చూపించారు. ‘ఈ బొమ్మలకు ఇన్నేసి నిధులు వెచ్చిస్తారా’ అని ప్రజలు పేర్కొంటున్నారు.

టెండర్లలోనూ..

టెండరు నిబంధనలు పాటించకుండా కొన్ని పనులకు నిధులు ఖర్చు చేయడం గమనార్హం. జాతీయ రహదారిపై డివైడర్లకు రంగులు వేసే పనులకు వాస్తవానికి మార్చి 7న టెండర్లు ఆహ్వానించారు. అంతకంటే ముందుగానే జీవీఎంసీ అధికారులు కొన్ని పనులు అస్మదీయులకు అప్పగించేశారు. ఇక పెయింటింగ్స్‌కు షార్ట్‌ టెండర్ల పేరుతో దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. హడావుడి పనుల పేరిట (షార్ట్‌ టెండర్లు) నిబంధనలను తుంగలో తొక్కారు. సీతకొండ రాక్‌ పెయింటింగ్‌కు మార్చి 21న టెండరు ఓపెన్‌ చేయగా మార్చి 27న రూ.16.32లక్షలకు అప్పగించారు. అదేవిధంగా తెన్నేటిపార్కు, అప్పుఘర్‌ వద్ద పెయింటింగ్‌ పనులకు రూ.11.52లక్షలకు అదే తేదీ, అదే సమయానికి అదే గుత్తేదారుకు ఇచ్చినట్లు చూపించారు. విచిత్రమేమంటే ఈ పనులు ఆన్‌లైన్లో టెండరు పిలిచే సమయానికే  గుత్తేదారుడికి అప్పగించేశారు. నిబంధనలు అమలు చేయాలి కనుక టెండర్లు ఆన్‌లైన్లో పిలిచి అనుకున్నవారికే అనుమతిచ్చారు. తక్కువ ధరే కోట్‌ చేసినా...టెండర్లలో ఒకరే పాల్గొంటే తప్పకుండా  రెండో సారి పిలవాలి. అదేమీ లేకుండా ఆడిట్‌లో ఎలాంటి అభ్యంతరాల్లేకుండా పనులు కేటాయించి జేబులు నింపేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

చేసిన పనులే చేసి... పైపై పూతలు: గతంలో వేసిన రోడ్లను కొత్తగా వేసినట్లు, గతంలో పూసిన రంగులను కొత్తగా వేసినట్లు చెబుతుండటం గమనార్హం. మైక్రో ట్రెంచ్‌ విధానంలో ఆరు మిల్లీ మీటర్ల మందంతో రహదారిపై తారు పొర వేయాల్సి ఉండగా ఇష్టారాజ్యంగా చేసి భారీగా బిల్లులు పెట్టారు. వాస్తవానికి మైక్రోట్రెంచ్‌ విధానం కాకుండా 25-30ఎంఎం మందంతో తారు లేయర్‌ వేస్తే నగర రద్దీకి అనుగుణంగా శాశ్వతంగా ఉంటుందని, ప్రస్తుతం వేసిన తేలికపాటి బీటీ పొర వర్షాలకు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. బీచ్‌ రోడ్డులో మరుగుదొడ్లు బాగానే ఉన్నప్పటికీ పునరుద్ధరణ పేరుతో రూ.20లక్షలు దుర్వినియోగం చేశారు. అదే తరహా హనుమంతవాక నుంచి అడివివరం వరకు బీఆర్టీఎస్‌ రహదారిలో బాగున్న డివైడర్ల (విభాగినుల)కు మరమ్మతుల పేరుతో రూ.40లక్షలు ప్రతిపాదించడం విశేషం.


విదేశీ ప్రతినిధులకు వాస్తవ పరిస్థితులు చూపించకుండా బీచ్‌ రోడ్డు, స్టార్‌ హోటళ్ల పరిసరాల్లో సుందరీకరణ పేరుతో రూ.కోట్లు దుర్వినియోగం చేశారు. జీవీఎంసీ కార్పోరేటర్లు అలాంటి ఖర్చులకు ఎలా అనుమతులిచ్చారు? ఆ పనులు కేవలం గుత్తేదారులకు లాభాలు కలిగించేవే కానీ ప్రజలకు ఉపయోగపడేవి కావు. ఈ విషయంలో రాష్ట్ర విజిలెన్స్‌ విభాగం దర్యాప్తు చేయాలి.

ఇదీ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ రాసిన బహిరంగ లేఖ సారాంశం.


తెన్నేటి పార్కు సమీపంలో..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జీవీఎంసీ, ఏపీ అర్బన్‌ గ్రీన్‌ సంస్థల ద్వారా ఖర్చు చేసిన రూ.150కోట్ల పనులపై థర్డ్‌ పార్టీ ఆడిట్‌ నిర్వహించాలి. జి-20 సదస్సు ముందే ఖరారైనా ఆలస్యంగా స్పందించి షార్ట్‌ టెండర్ల పేరిట రూ.కోట్ల నిధులు దుర్వినియోగం చేశారు. చేసిన పనులు, ఖర్చు అయిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి. కమీషన్లతో రూ.కోట్లు గడించిన జీవీఎంసీ అధికారులపై ఏసీబీ విచారణ జరగాలి.

ఇదీ ‘జి-20’ పనుల తీరుపై జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ డిమాండ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని