logo

మేమున్నామని.. మీకేం కాదని..

గృహ హింసకు గురవుతున్న మహిళ కావచ్చు... ప్రేమలో పడి మోసపోయిన యువతి కావచ్చు... పనిచేసే చోట వేధింపులకు గురవుతున్న ఉద్యోగిని కావచ్చు... బయటకు చెప్పుకోలేక...

Published : 31 Mar 2023 04:23 IST

భరోసా కల్పిస్తున్న ‘విన్‌’ కౌన్సెలింగ్‌ కేంద్రం
న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ

కౌన్సెలింగ్‌ చేస్తున్న నిపుణులు

గృహ హింసకు గురవుతున్న మహిళ కావచ్చు... ప్రేమలో పడి మోసపోయిన యువతి కావచ్చు... పనిచేసే చోట వేధింపులకు గురవుతున్న ఉద్యోగిని కావచ్చు... బయటకు చెప్పుకోలేక... పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేక తమలో తాము మదనపడే వారికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తోంది ‘విన్‌’ కౌన్సెలింగ్‌ సెంటర్‌. నగర పోలీసుశాఖ ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు సుమారు 98 శాతం మేర పరిష్కారాలతో బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నారు.

వివిధ విభాగాల నిపుణులతో ...

వేధింపులకు గురవుతున్నా.. కొందరు మహిళలు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయటానికి సంకోచిస్తుంటారు. అలాంటి వారి సమస్యలు కూడా పరిష్కారమవ్వాలనే ఉద్దేశంతో నగర పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉమన్‌ ఇన్‌ నీడ్‌ (విన్‌)పేరిట కౌన్సెలింగ్‌ సెంటర్‌ పోలీసు బ్యారక్స్‌లో ప్రస్తుతం నడుస్తోంది.

వారంలో రెండు రోజులు..

ప్రతీ మంగళ, గురువారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కౌన్సెలింగ్‌ కేంద్రం పనిచేస్తుంది. ఈ కౌన్సెలింగ్‌ కేంద్రం దిశా పోలీసు స్టేషన్‌ ఏసీపీ నేతృత్వంలో నడుస్తోంది. మహిళా శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, స్వచ్ఛంద సంస్థలు, మానసికశాస్త్ర నిపుణులు, పోలీసుశాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఉండి మహిళల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తారు. బాధిత మహిళలు విన్‌ కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని సందర్శించి వినతిరూపంలో తమ సమస్యలు తెలియజేయవచ్చు.

నెలలో 100 ఫిర్యాదులు

నెలకు సుమారు 100కుపైగా ఫిర్యాదులు అందుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి, ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్‌ చేస్తారు.

కేంద్రానికి వచ్చి ఫిర్యాదు చేస్తున్న వారిలో అత్యధికులు అవివాహితులు ఉంటున్నారు. ప్రేమ వైఫల్యం, వివాహేతర సంబంధాల కారణంగా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఫిర్యాదు చేసేవారిలో విద్యావంతులైన మధ్యతరగతి వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటం విశేషం. దీంతో 45 నుంచి 50 శాతం మంది తమ తప్పును తెలుసుకుని తిరిగి సంతోషకరమైన జీవనం సాగిస్తున్నారు.


గోప్యత పాటిస్తాం

- మాధవి గణపతి, ప్రతినిధి, వాసవ్య మహిళా మండలి

విన్‌ కౌన్సెలింగ్‌ కేంద్రానికి వచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతాం. మహిళలు వారి జీవితాల్లో జరిగే పరిణామాల్ని విశ్లేషించుకుని, పరిష్కారమార్గాలను ఆలోచించుకోవాలి. ప్రధానంగా జవాబుదారితనం లేకపోవటం, అహంకారం వంటి వాటి కారణంగానే ఎక్కువ మంది మహిళలు బాధితులుగా మారుతున్నారు. వివిధ విభాగాలకు చెందిన నిపుణుల సలహాలు, సూచనలతో సంతోషకరమైన జీవనానికి దోహదపడతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని