logo

కబ్జా దాహం.. అడుగుకో వ్యూహం!

కళ్ల ముందు ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు విశాఖలో వైకాపా నాయకులు కబ్జా చేసేస్తున్నారు. తాజాగా కరాస పోలీస్‌ క్వార్టర్స్‌ సమీపంలో దాదాపు రూ.16 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు పావులు కదిపారు.

Published : 30 Nov 2023 04:11 IST

ఈనాడు-విశాఖపట్నం: కళ్ల ముందు ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు విశాఖలో వైకాపా నాయకులు కబ్జా చేసేస్తున్నారు. తాజాగా కరాస పోలీస్‌ క్వార్టర్స్‌ సమీపంలో దాదాపు రూ.16 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు పావులు కదిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా, ఆక్రమణపై ఎవరూ ప్రశ్నించకుండా కొత్త ఎత్తుగడ వేశారు. జీవీఎంసీకి చెందిన యంత్రాలతో పనులు చేస్తే ఎవరూ దృష్టిసారించరని భావించారు. దర్జాగా మూడు రోజులుగా జేసీబీలతో చెట్లు తొలగిస్తూ.. మట్టి చదును పనులు చేపడుతున్నారు. ఈ స్థలం వద్ద ప్రత్యేకంగా ప్రైవేటు సైన్యంతో నిఘా ఏర్పాటు చేయడం గమనార్హం.

పూరిపాకతో మొదలు...

కరాసలో పోలీస్‌ క్వార్టర్స్‌, ఎయిర్‌ పోర్టు అథార్టీ ఆఫ్‌ ఇండియాకు కేటాయించిన స్థలాల మధ్య సర్వే నెంబరు 112లో విలువైన ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత స్థలంలో శ్మశాన వాటికతోపాటు, జీవీఎంసీ డంపింగ్‌ యార్డు ఉంది. తారు రోడ్డు ఆనుకుని సుమారు రెండు వేల చదరపు గజాల భూమి ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఐదేళ్ల కిందట ఈ ఖాళీ స్థలంలో వైకాపా నాయకుడు ఒకరు పూరి పాక ఏర్పాటు చేశారు. దీనికి స్థానికులు అభ్యంతరం చెప్పడం, అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే తొలగించారు. వైకాపా అధికారంలోకి రాగానే సదరు నేత మళ్లీ రంగంలోకి దిగారు. ఇటీవల ఇసుక, కంకర నిల్వలు ఖాళీ స్థలంలో డంప్‌ చేశారు. మరికొన్ని రోజులకే యాష్‌ బ్రిక్స్‌తో రక్షణ గోడ, ఓ గేటు సైతం ఏర్పాటు చేశారు.
వ్యర్థాలతో పూడ్చుతూ: శిథిల భవనాల వ్యర్థాలను ఈ స్థలం ఎదురుగా  ఉన్న ఖాళీ స్థలంలో డంప్‌ చేస్తున్నారు. రాత్రిళ్లు జీవీఎంసీ జేసీబీలతో ఈ వ్యర్థాలను తెచ్చి కబ్జాకు పావులు కదిపిన స్థలంలో నింపుతూ చదును చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చెట్లను సైతం ఇక్కడ నేలకూల్చారు. ఇక్కడ బహిరంగ మార్కెట్‌లో గజం రూ.80 వేల ధర పలుకుతోంది. అలా...రూ.16 కోట్ల విలువైన స్థలం ఆక్రమణలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నర్సరీ ముసుగులో..: ఎవరైనా స్థలం గురించి ఆరా తీస్తే నర్సరీ ఏర్పాటు చేస్తున్నట్లు కొత్త కథ అల్లుతున్నారు. ఆక్రమణ అని ప్రతిపక్ష పార్టీలు గళమెత్తితే అందుకు తగ్గట్టు ఆధారాలు సిద్ధం చేసుకునేలా అడుగులు పడ్డాయి. గ్రీన్‌ క్లైమెట్‌ టీం కోరిక మేరకు ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాల శిక్షణ, పర్యావరణ విద్యా వనరుల కేంద్రానికి స్థలానికి స్థలం అందించాలంటూ అక్టోబర్‌లో ఓ లేఖ ఓ కీలక నేత ద్వారా కార్పొరేషన్‌లో ఇచ్చి చేతులు దులిపేసుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని