logo

డ్వాక్రా సొమ్ము పక్కదారి

డ్వాక్రా మహిళల ఖాతాలకు వెళ్లాల్సిన పొదుపు సొమ్ము కొంత మంది సిబ్బంది తమ సొంత ఖాతాల్లోకి మళ్లించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలిలా..

Updated : 06 Dec 2023 05:05 IST

‘వెలుగు’ సీసీ సస్పెన్షన్‌

ఎం.పద్మ

పద్మనాభం, న్యూస్‌టుడే: డ్వాక్రా మహిళల ఖాతాలకు వెళ్లాల్సిన పొదుపు సొమ్ము కొంత మంది సిబ్బంది తమ సొంత ఖాతాల్లోకి మళ్లించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలిలా.. పద్మనాభం మండలంలోని ఒక్క పద్మనాభం పంచాయతీలోనే ‘వెలుగు’ వి.ఒ.ఎ. (విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌), సి.సి.(క్లస్టర్‌ కోఆర్డినేటర్‌) కలిసి సుమారు రూ.20లక్షల మేర అక్రమాలకు పాల్పడ్డారు. తొలుత ఈ విషయమై ‘జేకేసీ’ (జగనన్నకు చెబుదాం) విభాగానికి ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో సంబంధిత అధికారులు వి.ఒ.ఎ.ను బాధ్యురాలిని చేసి ఆమెను విధుల నుంచి తొలగించి చేతులు దులిపేసుకున్నారు. ఈ ఘటనలో వెలుగు మహిళా సమాఖ్య సీసీ ఎం.పద్మ హస్తం కూడా ఉందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో శాఖా పరమైన విచారణ చేపట్టారు. పొదుపు సంఘాల సభ్యుల నిధులను తప్పుడు పత్రాలు, నకిలీ రశీదులు సృష్టించి పక్కదారి పట్టించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. దాంతో పద్మనాభం మండల వెలుగు సీసీ ఎం.పద్మను జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పి.సూరమ్మ సస్పెండ్‌ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే..:  వెలుగులో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇటువంటి ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంత మహిళలు ఎక్కువ మందికి చదువు లేకపోవడంతో సిబ్బందిని నమ్మి మోసపోతున్నారు. పాండ్రంగి పంచాయతీ పరిధిలో గతంలో సుమారు రూ.కోటిన్నర మేర అక్రమాలు జరగ్గా అధికారులు సంబంధిత వ్యక్తి నుంచి రికవరీ చేశారు. తాజాగా పద్మనాభంలో జరిగింది. పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సిన ఏపీఎం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మండలంలోని ‘వెలుగు’ కార్యకలాపాలపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే మరిన్ని అక్రమాలు బయటకొస్తాయని కొందరు బాహాటంగా చెబుతుండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని