logo

బోట్ల వెలికితీతకు సన్నాహాలు

చేపలరేవు జీరో జెట్టీలో మునిగిన బోట్లను వెలికి తీసేందుకు మత్స్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు విశాఖ పోర్టు అథారిటీ(వీపీఎ) అధికారులకు లేఖ రాసింది.

Published : 06 Dec 2023 04:16 IST

మరమ్మతులకు స్థలం కేటాయించాలని ప్రతిపాదన
పోర్టు అధికారులకు లేఖ రాసిన మత్స్యశాఖ

చేపలరేవు జీరో జెట్టీలో మునిగి ఉన్న బోట్లు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: చేపలరేవు జీరో జెట్టీలో మునిగిన బోట్లను వెలికి తీసేందుకు మత్స్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు విశాఖ పోర్టు అథారిటీ(వీపీఎ) అధికారులకు లేఖ రాసింది. బోట్లను వెలికి తీయడం, వెంటనే మరమ్మతులు ప్రారంభించడానికి అవసరమైన ప్రత్యామ్నాయాలను సదరు లేఖలో మత్స్యశాఖ అధికారులు సూచించారు. మత్స్యశాఖ జేడీ ఎస్‌కే లాల్‌ మహమ్మద్‌ మూడు రోజుల క్రితం బోటు ఆపరేటర్లతో కలిసి చేపలరేవులోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఒకేసారి పదుల సంఖ్యలో బోట్లకు మరమ్మతులు చేయాలంటే అనువైన ప్రదేశం అందుబాటులో ఉండాలి. 11, 12 నెంబరు జెట్టీలను ఆనుకొని ఎకరం ఖాళీ స్థలం ఉంది. మునిగిన బోట్లను వెలికి తీసి అక్కడికి తరలించాలని నిర్ణయించారు. ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని కేటాయించాలని పోర్టు అధికారులను మత్స్యశాఖ అధికారులు కోరారు.

అధికారులతో చర్చిస్తున్న మత్స్యశాఖ జేడీ లాల్‌ అహ్మద్‌

నవంబరు 20న చేపలరేవులో జరిగిన అగ్నిప్రమాదంలో 47 బోట్లు దగ్ధమయ్యాయి. బోట్లకు ఉండే కర్ర, ఫైబర్‌ కాలిపోయినప్పటికీ ఇనుము చెక్కు చెదరల్లేదు. దాన్ని వెలికి తీసి కర్ర, ఫైబర్‌ను వినియోగించి మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. ఈ కారణంగా వెలికి తీసిన శిథిలాలను ఒక చోట భద్రపర్చాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి 12వ నెంబరు జెట్టీని ఆనుకొని ఉన్న ప్రాంతాన్ని అనువైనదిగా గుర్తించారు. పోర్టు యంత్రాంగం నుంచి వచ్చే తదుపరి ఆదేశాల మేరకు బోట్ల వెలికితీత ఆధారపడి ఉంది.

తుపాను ప్రభావంతో మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. సముద్రంలోకి వెళ్లిన బోట్లు జెట్టీలకు చేరాయి. జీరో జెట్టీలో వాటికి లంగరు వేసే పరిస్థితి లేకపోవడంతో మిగిలిన జెట్టీల్లో ఉంచుతున్నారు. అక్కడ చోటు సరిపోవడం లేదు. తక్షణమే బోట్లను వెలికి తీసి తదుపరి చర్యలు చేపట్టాలని ఆపరేటర్లు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని