logo

సహాయక కేంద్రాలకు తరలించాలి

తుపాను సమయంలో ఏర్పడే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ రవి అధికారులను ఆదేశించారు.

Published : 06 Dec 2023 04:27 IST

వెబ్‌ఎక్స్‌ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీవోలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి, జేసీ జాహ్నవి, డీఆర్వో దయానిధి

కలెక్టరేట్, న్యూస్‌టుడే: తుపాను సమయంలో ఏర్పడే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం వెబ్‌ఎక్స్‌ ద్వారా జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్‌ సూచనలిచ్చారు. పాతపడిన, బలహీనంగా ఉన్న భవనాల్లో నివశించే వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సహాయక కేంద్రాలకు తరలించి, తాగునీరు, ఆహారం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.  ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా యంత్రాంగానికి విపత్కర పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో బి.దయానిధి, సీపీవో రామారావు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.


నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: తెదేపా

అనకాపల్లి, న్యూస్‌టుడే: తుపాన్‌ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు. ఎకరాకు రూ.30 వేలు పరిహారంగా ఇవ్వాలని, ఇంతవరకు కరవుతో నష్టపోయిన రైతులు ఇప్పుడు భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తుపాను కారంగా 20వేల ఎకరాలకు పైగానే వరి పంట దెబ్బతిందని చెప్పారు. ముందుగానే వాతావరణ శాఖ అధికారులు తుపాను హెచ్చరికలు చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. తీరా తుపాను వచ్చిన తర్వాత హడావుడి చేయడం సరికాదన్నారు. చెరకు పంటతో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని