logo

వైకాపా నాయకుల... భూదాహం

అధికార వైకాపా నేతలు కొందరు ప్రభుత్వ భూముల ఆక్రమణలకు తెగించారు. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండల పరిధిలో ఏకంగా ప్రభుత్వ భూమిని చదును చేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు.

Updated : 06 Dec 2023 04:57 IST

కీలక నేత అనుచరుల ఆక్రమణ పర్వం
ఎనిమిది ఎకరాల కొండ పోరంబోకు చదును
రూ.4 కోట్ల భూమి అమ్మకానికి వ్యూహం

ఆక్రమణకు గురైన భూమి ఇదే

ఈనాడు-విశాఖపట్నం: అధికార వైకాపా నేతలు కొందరు ప్రభుత్వ భూముల ఆక్రమణలకు తెగించారు. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండల పరిధిలో ఏకంగా ప్రభుత్వ భూమిని చదును చేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు. దస్త్రాల్లోని కొన్ని లోపాలను అడ్డం పెట్టుకొని చక్రం తిప్పారు. కృష్ణాపురం గ్రామంలో సర్వే నెంబరు 82-2లో ప్రభుత్వ కొండ పోరంబోకు భూమి ఉంది. ఇందులో సుమారు 8 ఎకరాలను స్థానిక వైకాపా నాయకులు ఆరు నెలల క్రితం చదును చేసి గుప్పిట్లో పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా.. ఆ స్థలంలోకి ఎవ్వరూ కాలు పెట్టకూడదన్న ఆలోచనతో ఓ షెడ్డు నిర్మించి అందులో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ షెడ్డు గోడలపై ‘స్థలం హక్కుదారులంటూ’ పేర్లు రాశారు. ఇలా కబ్జా గుప్పిట్లోకి వెళ్లిన భూమి  పద్మనాభం-తగరపువలస ప్రధాన రహదారి పక్కన ఉన్న వెంగమాంబ-ఎన్‌బీసీ క్వారీల మధ్య ఉంది. ఇక్కడ ఎకరా దాదాపు రూ.60 లక్షల వరకు ధర పలుకుతుంది.


ఈ భూమిని ప్రస్తుతం అమ్మేందుకు ప్రణాళిక రచించారు. కృష్ణాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మధ్యవర్తిత్వం చేసి 8 ఎకరాలను రూ.4 కోట్లకు బేరం కుదిర్చినట్లు సమాచారం. అడ్వాన్సుగా ఇటీవల కొంత చేతులు మారినట్లు తెలిసింది. గ్రామానికి చెందిన ఇద్దరు కీలక నేతలు ఆక్రమణలో కీలకంగా వ్యవహరించారనే చర్చ సాగుతోంది. ఆ ఇద్దరు స్థానిక అధికార ప్రజాప్రతినిధికి ప్రధాన అనుచరులుగా ముద్ర వేసుకున్నారు. దీంతో ఈ ఆక్రమణపై స్థానికంగా ఎవరూ నోరెత్తే సాహసం చేయడం లేదు.


నిర్మించిన షెడ్‌

కృష్ణాపురం గ్రామం అన్‌సెటిల్డ్‌ విలేజ్‌ కింద ఉంది. ఎవరైనా తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు చూపిస్తే రెవెన్యూలోని పాత అడంగళ్‌ ఆధారంగా అధికారులు పొజిషన్‌ ఇవ్వడం అక్రమార్కులకు వరమైంది. ఆక్రమణలో ఉన్న 8 ఎకరాల్లో సుమారు 60 సెంట్లను ఇప్పటికే జిరాయితీగా రికార్డుల్లోకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారి ఒకరు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఆక్రమిత స్థలంలో విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో ఇది సున్నితమైన అంశంగా మారింది.


ఇలా అయితేనే అధికారులు కూల్చకుండా ఉంటారని ఎత్తుగడ వేశారు. అదే సాకుగా చూపిస్తూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీనిపై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా... ప్రస్తుత ఆక్రమణపై పరిశీలిస్తామన్నారు. కొన్ని రోజుల క్రితం ఓ ఫిర్యాదు వస్తే క్షేత్రస్థాయికి వెళ్లి చూడగా, రేకుల షెడ్‌లో విగ్రహం ఉంది. ఈ షెడ్‌ పైకప్పును ఎవరో ధ్వంసం చేశారని పోలీస్‌ స్టేషన్‌లో ఓ ఫిర్యాదు సైతం ఉన్నట్లు తెలిసింది. సున్నితమైన విషయం కనుక ఆ షెడ్డుపై చర్యలు తీసుకోలేదని డిప్యూటీ తహసీల్దార్‌ సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని