logo

ముంచెత్తిన ‘మిగ్‌జాం’

‘మిగ్‌జాం’ తీవ్ర తుపాను ప్రభావంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో గెడ్డలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనానికి ఆటంకం ఏర్పడింది.

Updated : 06 Dec 2023 05:06 IST

లోతట్టుప్రాంతాలు జలమయం
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

ఆర్‌కే బీచ్‌లో కెరటాల ఉద్ధృతి

‘మిగ్‌జాం’ తీవ్ర తుపాను ప్రభావంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో గెడ్డలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. బాపట్లలో తుపాను తీరం దాటే సమయంలో ఇక్కడ కూడా సముద్రం అల్లకల్లోలంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు రైతులు  తంటాలు పడ్డారు.

రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ  (ఏపీఎస్‌డీపీఎస్‌) వెబ్‌సైట్‌ ప్రకారం.. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో సరాసరి 5 సెం.మీ., 12 ప్రాంతాల్లో 4 సెం.మీ., 59 ప్రాంతాల్లో 3 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదైంది. బుధవారం కూడా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించింది. మత్స్యకారులు 48 గంటల వరకు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. విశాఖ పోర్టులో మూడో నెంబరు ప్రమాద సూచిక కొనసాగిస్తున్నారు.

పెదగదిలి బీఆర్‌టీఎస్‌ రహదారిలో నిలిచిన వర్షం నీరు


యంత్రాంగం అప్రమత్తం

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో యంత్రాంగం అప్రమత్తత చర్యలను కొనసాగిస్తోంది.  కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ, తహసీల్దారు కార్యాలయాలు, జీవీఎంసీలో ఏర్పాటు చేసిన నియంత్రణ గదులను కొనసాగిస్తున్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులను కలెక్టర్‌ మల్లికార్జున ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు ఇస్తున్నారు. అవసరమైతే తక్షణమే సహాయక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. పంటలకు జరిగిన నష్టంపై కలెక్టర్‌ వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఇంత వరకు నష్టాలు నమోదు కాలేదని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉన్నామని, బుధవారం వరకు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల కారణంగా బోట్లు చేపలరేవులో నిలిచిపోయాయి. వర్షాలు తగ్గితే బుధవారం సాయంత్రం నుంచి వేటకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

చినగదిలిలో వర్షంలోనే రేషన్‌కు వరుసలో ఉన్న స్థానికులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని