logo

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?

పంటలు నీట మునిగి పీకల్లోతు కష్టాల్లో రైతాంగం ఉంటే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే పరిస్థితికి తీసుకువెళ్లారని తెదేపా జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగజగదీశ్వరరావు మండిపడ్డారు.

Published : 07 Dec 2023 03:09 IST

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: పంటలు నీట మునిగి పీకల్లోతు కష్టాల్లో రైతాంగం ఉంటే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే పరిస్థితికి తీసుకువెళ్లారని తెదేపా జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగజగదీశ్వరరావు మండిపడ్డారు. అనకాపల్లి మండలంలో నీట మునిగి పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను బుధవారం ఆయన పరిశీలించారు. మార్టూరులో పెద్దఎత్తున వరి పంట దెబ్బ తినడంతో ఆందోళన చెందుతున్న రైతులను ఆయన ఓదార్చారు. ఒక్క అవకాశం అంటూ పదవి దక్కించుకున్న ముఖ్యమంత్రికి రైతులు కనిపించడం లేదని ఆరోపించారు. రైతులు చేలల్లో కన్నీళ్లు కారుస్తుంటే ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కనీసం పరిశీలన చేయలేదన్నారు. ఇక ఎలాగూ అధికారం పోతోందని సామాన్లు సర్దుకునే పనిలో పాలకులు ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఆదుకునే వారన్నారు. హుద్‌హుద్‌లో నష్టపోయిన వరి పంటలకు నష్ట పరిహారం అందించారని వివరించారు. ప్రభుత్వం వెంటనే దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి అధికారులు నష్టాలు అంచనా వేయాలన్నారు. ప్రతి ఎకరానికి రూ. 30 వేల పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఇతర పంటలను ఆదుకోవాలన్నారు. లేనిపక్షంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, రైతు సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. నాయకులు కోట్ని రామకృష్ణ, మళ్ల గణేష్‌, బోడి వెంకటరావు, కోడి నాగేశ్వరరావు, సాలాపు నాయుడు, మళ్ల శివనారాయణ, సలాది చంద్రావతి, రైతు ప్రతినిధులు కరణం దుర్గాప్రసాద్‌, కరణం సత్యారావు, కరణం సోమునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని