logo

తుపాను సన్నద్ధతలో ప్రభుత్వం విఫలం: అనిత

తుపానుపై ప్రజలను రక్షించి, సన్నద్ధత చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. నక్కపల్లిలో ముంపునకు గురైన కాలనీలోకి వెళ్లి ఆమె బాధితులను పరామర్శించి, మగ్గాలు పరిశీలించారు.

Published : 07 Dec 2023 03:11 IST

నక్కపల్లి, న్యూస్‌టుడే: తుపానుపై ప్రజలను రక్షించి, సన్నద్ధత చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. నక్కపల్లిలో ముంపునకు గురైన కాలనీలోకి వెళ్లి ఆమె బాధితులను పరామర్శించి, మగ్గాలు పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విపత్తు వస్తుందంటే సంబంధిత అధికారులతో మాట్లాడి, ఎక్కడ ఎటువంటి నష్టం వస్తుందో తెలుసుకుని ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉండగా, సర్కార్‌ అలాంటివేమీ పట్టించుకోలేదన్నారు. దీనిపై విపత్తులశాఖ ముందుగానే చెప్పినా పెడచెవిన పెట్టారన్నారు. ఫలితంగా చేనేత కాలనీ ఇళ్లన్నీ మునిగి, బాధితులు కట్టుబట్టలతో ఉన్నారన్నారు.  నియోజకవర్గం మొత్తం ఇదే పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్యే వచ్చి బాధితులను నేరుగా కలవకుండా, నీరు తగ్గిన తర్వాత వస్తానని చెప్పడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. మగ్గాలతో పాటు, పంటలకు, ఆస్తినష్టాలకు సంబంధించి ప్రభుత్వం పూర్తి నష్ట్ట పరిహారం చెల్లించి బాధితులందరినీ ఆదుకోవాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో కొప్పిశెట్టి వెంకటేష్‌, అమలకంటి అబద్దం, అడ్డూరి లోవరాజు, పెదిరెడ్డి రమేష్‌, సకురు సత్తిబాబు, అల్లాడ తాతారావు, సన్యాసిరావు, గంట్యాడ రమేష్‌, పిక్కి గంగరాజు, మడదా రాంబాబు, అడ్డూరి భూషణం, గోసల కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని