logo

23న సింహగిరిపై వైకుంఠ ఏకాదశి ఉత్సవం

సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈనెల 23వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు.

Published : 07 Dec 2023 03:17 IST

సింహాచలం, న్యూస్‌టుడే: సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈనెల 23వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కొండ దిగువన విజయరామరాజు భవనంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 23న వేకువజామున 4.15 గంటల నుంచి 4.30 గంటల వరకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఉత్తర ద్వారంలో వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 5 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆలయ ఉత్తర గోపురంలో భక్తులకు స్వామివారి ఉత్తరద్వార దర్శనం కల్పిస్తారు. ఈ ఏడాది ఈ ఉత్సవం శనివారం రావడంతో సుమారు 50వేల మందికి పైగా భక్తులు తరలివస్తారన్న అంచనాతో తగిన ఏర్పాట్లు చేయడానికి నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ రోజు ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే అంతరాలయ దర్శనం కల్పిస్తారు. మిగిలిన వారంతా నీలాద్రి గుమ్మం వద్ద నుంచే దర్శనాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజున ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.300, రూ.500 టికెట్లు అందుబాటులో ఉంటాయి. దర్శనం అనంతరం భక్తులకు పొంగలి, పులుసు ప్రసాదం పంపిణీ చేస్తారు. అన్ని ప్రభుత్వ శాఖల సహాయంతో ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఐ.వి.రమణాచార్యులు, నగర ట్రాఫిక్‌ ఏడీసీపీ శ్రీనివాసరావు, ఏసీపీ రాజీవ్‌కుమార్‌, దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు, రాంబాబు, ట్రస్టుబోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేశ్‌రాజ్‌, శ్రీదేవి వర్మ, సువ్వాడ శ్రీదేవి, రామలక్ష్మీ, రాజేశ్వరి, సాయినిర్మల, ప్రత్యేక ఆహ్వానితులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని