logo

విరిగిపడిన కొండచరియలు

తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బొర్రా, అనంతగిరి మార్గంలో బుధవారం ఉదయం కొండచరియలు విరిగి పడడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు.

Updated : 07 Dec 2023 05:40 IST

అరకు మార్గంలో నిలిచిన రాకపోకలు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బొర్రా, అనంతగిరి మార్గంలో బుధవారం ఉదయం కొండచరియలు విరిగి పడడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. జిల్లాలోని బొడ్డవర చెక్‌పోస్టు వద్ద అరకువైపు వెళ్లే వాహనాలను ఎస్‌.కోట పోలీసులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు మంగళవారం రాత్రి అరకు సమీప బీసుపురం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాలు నిలిపివేశారు. పర్యాటకుల తెల్లవారుజామున 3 గంటల వరకు బస్సుల్లోనే అవస్థలు పడ్డారు. పునరుద్ధరిస్తున్న సమయంలో అనంతగిరి మార్గంలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. అనంతగిరి పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టి సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో రాకపోకలు పునరుద్ధరించారు. దీంతో ఎస్‌.కోట పోలీసులు బొడ్డవర చెక్‌పోస్టు నుంచి నాలుగు ఆర్టీసీ బస్సులను పంపారు. వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతుండడంతో బుధవారం రాత్రి 8 గంటలకు నుంచి అరకు వైపు రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నామని, గురువారం కూడా అనుమతించబోమని సీఐ బాలసూర్యారావు తెలిపారు. ఈ మార్గంలో కొండచరియలు పడే ప్రమాదం ఉందంటూ అనంతగిరి ఎస్‌ఐ అందించిన సమాచారంతో బొడ్డవర వద్ద ఎస్‌.కోట పోలీసులు రాత్రి 8 గంటల సమయం నుంచి వాహనాలను నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలను సైతం వెళ్లకుండా చూస్తున్నారు. గురువారం కూడా రాకపోకలు నిలిపివేస్తామని ఎస్‌.కోట ఎస్‌ఐ లోవరాజు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

రైల్వేమార్గంలోనూ...: కేకే రైల్వేలైనులో తైడా సమీపంలో విద్యుత్తు తీగలపై చెట్లు పడడంతో లైనులో మంటలు చెలరేగాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మంగళవారం అరకులో ఆగిపోయిన పాసింజరు రైలును మాత్రం బుధవారం విశాఖ పంపారు. విశాఖ నుంచి పాసింజరు రైళ్లు రాలేదు. విద్యుత్తు లైను పునరుద్ధరించారు. గూడ్సు రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని