logo

ఆగని వానలు.. ఉప్పొంగిన వాగులు

మిగ్‌జాం తుపాను తీరం దాటినా అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. చేతికందాల్సిన వేల ఎకరాల పంట ఈ తుపాను ధాటికి గంగపాలైంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలతో రెండు జిల్లాల వాసులు చిగురుటాకుల్లా వణికిపోయారు.

Updated : 07 Dec 2023 05:42 IST

ఈనాడు, అనకాపల్లి

మిగ్‌జాం తుపాను తీరం దాటినా అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. చేతికందాల్సిన వేల ఎకరాల పంట ఈ తుపాను ధాటికి గంగపాలైంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలతో రెండు జిల్లాల వాసులు చిగురుటాకుల్లా వణికిపోయారు. నిన్నమొన్నటి వరకు వట్టిపోయిన గెడ్డలు, వాగులు, నదులన్నీ ఒక్క వర్షానికే పొంగి పొర్లాయి. గట్లుకు గండ్లు పడడంతో వరదనీరంతా ఊళ్లమీదకు పోయింది. పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వందలాది ఇళ్లలోకి నీరుచేరి నిరాశ్రయులయ్యారు.

ధికారులు సమీక్షలు, సలహాలివ్వడానికే పరిమితమయ్యారు తప్ప ఆదుకునే చర్యలేవీ చేపట్టలేదు. తుపాను తీవ్రతను అంచనా వేయలేకపోయారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల వారిని ముందస్తుగా తరలించే ఏర్పాట్లు చేయలేకపోయారు. మొక్కుబడిగా ఒకటి రెండు చోట్ల పునరావాసం పేరుతో మధ్యాహ్న భోజన పథకం నుంచి అరకొరగా వండి పెట్టి మమ అనిపించారు. నక్కపల్లిలోని చేనేత కాలనీలో 80కి పైగా ఇళ్లు ముంపునకు గురైతే వారికి ప్రభుత్వం తరఫున భోజనం అందించలేకపోయారు. దాతలు ముందుకొచ్చి వారి ఆకలి దప్పులు తీర్చారు.

తుపాను తీరం దాటిన ప్రాంతంలో కురిసిన వర్షం కంటే అనకాపల్లి జిల్లాలో పడిన వర్షమే ఎక్కువగా ఉంది. జిల్లాలోని తొమ్మిది చోట్ల 20 సెం.మీ పైగా వర్షపాతం నమోదైతే, మరో పది చోట్ల 15 నుంచి 20 సెం.మీ వర్షం కురిసింది. అలాగే మరో 20 ప్రాంతాల్లో 10 నుంచి 15 సెం.మీ వర్షం కురవడంతో జలవనరులన్నీ నిండాయి. ఎస్‌.రాయవరం, కోటవురట్ల, నర్సీపట్నం, నాతవరం మండలాల పరిధిలో గరిష్ఠ వర్షపాతం నమోదవ్వడంతో వరహా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం కూడా జిల్లాలో చాలా చోట్ల 5 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో ఎక్కడికక్కడ వాగులు, గెడ్డలు ఉద్ధృతంగా పారుతున్నాయి. చేలో నీరంతా బయటకు పోతేగానీ పంట నష్టాన్ని అంచనా వేయడం సాధ్యం కాదని అధికారులంటున్నారు. 


 భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు

అచ్యుతాపురం, ఎలమంచిలి, న్యూస్‌టుడే: భారీ వర్షాలకు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. పెదపాడు, ఖాజీపాలెం, జగ్గన్నపేట, హరిపాలెం, తిమ్మరాజుపేటలను ఆనుకొని ప్రవహిస్తున్న రోలుగెడ్డ, పూరిడిగెడ్డ, మెలిపాక గెడ్డ, పాతయేర్లు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయి. కొండగెడ్డ ఉద్ధృతికి మోసయ్యపేట ముంపునకు గురైంది.


రహదారి లోపాలతో ముంపు

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: కూండ్రం గ్రామంలో ఇటీవల నిర్మించిన రహదారి లోపాలతో వర్షపు నీరంతా నివాసాల్లోకి చేరుతోంది. ఇంట్లోకి నీరు రావడంతో వారంతా కంటి మీద కునుకు లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇళ్లంతా వర్షపు నీరు చేరడంతో వంటలు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లంతా నీటితో నిండి ఉంటే ఎలా ఉండగలమని వారు ప్రశ్నిస్తున్నారు. రహదారులు, భవనాల శాఖ కేబీ రహదారి నిర్మాణంలో భాగంగా కూండ్రం వద్ద రహదారిని పూర్తిగా విస్తరించకుండా, కాలువల నిర్మాణం చేపట్టకుండా నిలిపివేశారు. దీంతో రహదారిని ఆనుకొని ఉన్న నివాసాల్లోకి వర్షపు నీరు చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి చింతల శ్రీనివాస్‌ను వివరణ కోరగా నీటిని తొలగించే చర్యలు చేపడతామన్నారు.  


మునిగిన పైర్లు.. జగనన్న కాలనీలు

ఎలమంచిలి, మునగపాక, మాకవరపాలెం, కోటవురట్ల: భారీ వర్షాలతో జిల్లాలో జగనన్న కాలనీలు చాలావరకు జలమయమైపోయాయి. నక్కపల్లి, ఎస్‌.రాయవరం, రాంబిల్లి, మునగపాక, కశింకోట, మాకవరపాలెం మండలాల్లోని జగనన్న కాలనీలను వరద చుట్టుముట్టేసింది. ఇళ్ల నిర్మాణాల కోసం తెచ్చుకున్న సిమెంటు, ఇసుక అంతా నీటిలో కలిసిపోయాయి. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు చాలక అప్పులు చేసి కట్టుకుంటున్నామని, ఇప్పుడిలా ఎటూ కాని పరిస్థితుల్లో చిక్కుకున్నామని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.

వరహా నది ఉద్ధృతంగా ప్రవహించడంతో కోటవురట్ల, ఎస్‌.రాయవరం మండలాల్లో వరిపైరు ముంపునకు గురైంది. ఎలమంచిలిలోని శేషుగెడ్డలో వరద పెరుగుతుండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు తగ్గకపోవడం, ఎండకు చోటులేకపోవడంతో నేలకొరిగిన పైరు నీటిలోనే ఉండడంతో నానిపోయి మొలకలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులంటున్నారు.


నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం జలమయం

నర్సీపట్నం, న్యూస్‌టుడే: ఎడతెరిపి లేని వర్షాలతో నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం జలమయమైంది. బ్రిటిష్‌ హయాంలో నిర్మించిన పురాతన భవనంలోనే ఈ కార్యాలయం కొనసాగుతోంది. భారీ వర్షానికి పైకప్పు నుంచి నీరు కారిపోతోంది. దీంతో ఉద్యోగులు ఎవరూ తమ సీట్లలో కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. గదులన్నీ చెరువులా మారాయి. సీలింగ్‌ ఎక్కడ కూలిపోతుందోనని సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్‌డీఓ ఛాంబర్‌ గదిలో సైతం వర్షపు నీరు చేరింది. తడిసిన కంప్యూటర్లను ఆన్‌ చేస్తే అవి ఎక్కడ కాలిపోతాయోనని వాటిని స్విచ్‌ఆఫ్‌ చేసి ఉంచారు. దీనివల్ల ఉద్యోగుల విధులకు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యాలయం దుస్థితిపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని సిబ్బంది తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు ఆసుపత్రిలో సైతం వర్షపు నీరు భారీగా చేరింది. దీంతో రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర అవస్థలు పడ్డారు.


ప్రమాదకరంగా ఏలేరు కాలువ గట్టు

అనకాపల్లి గ్రామీణం,  కశింకోట, న్యూస్‌టుడే:  భారీ వర్షాలకు శంకరం బొజ్జన్న కొండ సమీపంలో ఏలేరు కాలువ ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. రహదారి వద్ద రెండు చోట్ల కాలువ గట్టు పైనుంచి నీరు ప్రవహిస్తోంది. ఈ నీరు అంతా సమీప పంట పొలాల్లోకి చేరుతోంది. చిన్నపాటి గండి పడడంతో నీరు అంతా పోతోంది. భారీ గండి పడే అవకాశం ఉండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కశింకోట సమీపంలో జాతీయరహదారిపై వరద ప్రవహించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని