logo

తుపాను పంజా కుంభవృష్టి... ముంచేసింది!!

‘మిగ్‌జాం’ తుపాను బలహీనపడిన తర్వాత జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు, చెట్లు, ప్రహరీలు కూలిపోయాయి.

Published : 07 Dec 2023 03:53 IST

పొంగిన గెడ్డలు.. కూలిన గోడలు
నీట మునిగిన పంటలు
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

‘మిగ్‌జాం’ తుపాను బలహీనపడిన తర్వాత జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు, చెట్లు, ప్రహరీలు కూలిపోయాయి. పార్కుల్లో, రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. గెడ్డలు పొంగిపొర్లాయి. మురుగు, వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల కల్వర్టులు కొట్టుకుపోయాయి. భీమిలి, రుషికొండ, ఆర్కే బీచ్‌ తదితర ప్రాంతాల్లో తీర ప్రాంతం కోతకు గురైంది. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వ్యాపారాలు మూతపడ్డాయి.  దుకాణాలు తెరవకపోవడంతో నష్టపోయామని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గురు, శుక్రవారాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

  • 59వ వార్డు ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కాలనీలోని కొండ వాలులో రాళ్లు జారడంతో ఓ ఇంటి ముందుభాగం కూలిపోయింది. పెదగంట్యాడ హెచ్‌బీ కాలనీలో పాత ఇంటిపై గోడ కూలగా... ఎవరికీ ప్రమాదం జరగలేదు. నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద గోడ కూలి ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. కొండవాలు ప్రాంతాల్లో రాళ్లు, మట్టిపెళ్లలు జారిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వాల్తేరులోని తుపాను హెచ్చరికల కేంద్రానికి సమీపంలో భారీ వృక్షం నేలకొరిగింది. బీహెచ్‌పీవీలో జాతీయ రహదారి పక్కన సర్వీస్‌ రోడ్డులో 33 కేవీ లైనుకు చెందిన విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
  • భీమిలి నియోజకవర్గం పరిధిలోని పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాల్లో 500 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పరవాడ మండలంలో 40 ఎకరాల్లో కోత దశకు వచ్చిన వరి పంట నేలవాలింది.


న్యూస్‌టుడే, పెందుర్తి: పెందుర్తి మండలంలోని గుర్రంపాలెం పంచాయతీలో జగనన్న కాలనీ నీట మునిగింది. వర్షాలకు కొండవాలు నుంచి పారుతున్న నీరు నేరుగా కాలనీలోకి చేరుతోంది. కిందికి వెళ్లే మార్గం లేకపోవడంతో అక్కడే నిలిచిపోతుంది. అధికారులు స్పందించి, పరిష్కారం చూపాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని