logo

Hanuman: హను-మాన్‌ @ పాడేరు

అధునాతన సాంకేతికతను రంగరించి ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా హను-మాన్‌. చీడికాడ మండలం కోనాం జలాశయం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించి పలు సన్నివేశాలను చిత్రీకరించారు.

Updated : 11 Feb 2024 16:20 IST

కోనాంలోనూ చిత్రీకరణ
గ్రాఫిక్స్‌ మాంత్రికుడు చోడవరం వాసే

మంచుకొండలో హనుమంతుడు

చోడవరం/గ్రామీణం, న్యూస్‌టుడే: అధునాతన సాంకేతికతను రంగరించి ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా హను-మాన్‌. చీడికాడ మండలం కోనాం జలాశయం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించి పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రానికి గ్రాఫిక్స్‌ వర్క్‌ చేసిన పి.ఉదయ్‌కృష్ణ చోడవరం ప్రాంతానికి చెందిన వారే. ఈయన ఆరు నుంచి పదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. తల్లిదండ్రులు పండమనేటి సీతారామమూర్తి, అన్నపూర్ణ. తండ్రి చోడవరం ట్రెజరీలో పనిచేశారు. జిల్లా ట్రెజరీ అధికారిగా ఉద్యోగ విరమణ చేసి ప్రస్తుతం విశాఖలో నివాసం ఉంటున్నారు. ఉదయ్‌కృష్ణ హైదరాబాద్‌లోనే సినీ కెరీర్‌ను ప్రారంభించాడు. ఈయన కొన్ని తెలుగు సినిమాలకు పనిచేశారు. తక్కువ బడ్జెట్‌, పరిమిత వనరులతోనూ సమర్థంగా పనిచేస్తారన్న పేరు గడించారు. చెన్నై, బెంగళూరు, ముంబయిలలో బహుళ జాతీయ కంపెనీల ప్రచారంతోపాటు బాలీవుడ్‌, హాలీవుడ్‌లోనూ పనిచేశారు. బాహుబలి సినిమా గ్రాఫిక్స్‌లోనూ కొంతవరకు పనిచేశారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ రంగంలో రెండున్నర దశాబ్దాల అనుభవం గడించాక హను-మాన్‌ చిత్రంతో తిరుగులేని విజయం అందుకున్నారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కు పాడేరు గిరులను అనుసంధానం చేశారు. తన స్నేహితుడు చోడవరానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ కోరుకొండ సత్యనారాయణమూర్తి (సత్తిబాబు)తో కలిసి వారంపాటు పాడేరులో తిరిగారు. మూడు వేలకుపైగా ఫొటోలు, వీడియోలు తీశారు. వాటిని హను-మాన్‌ సినిమాలో గ్రాఫిక్స్‌కు అనుగుణంగా వాడారు. బాల్య స్నేహితుడు గరిమెళ్ల కృష్ణ వచనా కవిత్వం తనను ఆకట్టుకుందని ఉదయ్‌కృష్ణ  చెప్పారు. వినాయక ఉత్సవాల్లో నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు చూడటం, నాటికలు వేయడం సృజనాత్మక రంగంలోకి వచ్చేందుకు దోహదపడ్డాయని తెలిపారు. ‘ఉదయ్‌కృష్ణ బీస్ట్‌ బెల్స్‌’ పేరుతో హైదరాబాద్‌లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థను ఏర్పాటు  చేయనున్నట్లు చెప్పారు.

పాడేరులోదే ఈ సుందర దృశ్యం

 


ఉదయ్‌కృష్ణ


సత్యనారాయణమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని