logo

స్మార్ట్‌ బాదుడుకు ‘సిద్ధం’..!

విద్యుత్తు ఛార్జీలు పెంచలేదంటూనే వినియోగదారులపై స్మార్ట్‌ బాదుడుకు సర్కారు సిద్ధమవుతోంది. ఇప్పటికే వాడిన కరెంటు ఛార్జీల కంటే ట్రూఅప్‌, ఎఫ్‌పీపీసీఏ-1, 2 పేరుతో అదనంగా వడ్డిస్తోంది.

Updated : 13 Feb 2024 03:57 IST

వినియోగదారులపై ప్రీపెయిడ్‌ మీటర్ల కొనుగోలు భారం
తొలుత వాణిజ్య, పరిశ్రమల కేటగిరీలకు మార్పు
200 యూనిట్లపైబడి వాడే గృహాలకు అమర్చే యోచన
ఈనాడు, అనకాపల్లి

విద్యుత్తు ఛార్జీలు పెంచలేదంటూనే వినియోగదారులపై స్మార్ట్‌ బాదుడుకు సర్కారు సిద్ధమవుతోంది. ఇప్పటికే వాడిన కరెంటు ఛార్జీల కంటే ట్రూఅప్‌, ఎఫ్‌పీపీసీఏ-1, 2 పేరుతో అదనంగా వడ్డిస్తోంది. తాజాగా స్మార్ట్‌ మీటర్ల భారాన్ని వినియోగదారుల నెత్తిన పెట్టబోతోంది. ఈ నెలలోనే కొన్ని రకాల కేటగిరీ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లను అమర్చబోతున్నారు. ఈ మీటర్ల కొనుగోలు నుంచి ఇన్‌స్టాలేషన్‌ వరకు అయ్యే వ్యయాన్ని ఆయా కేటగిరీల వారి నుంచి నెలవారీ బిల్లుల ద్వారా ఈఎంఐ రూపంలో వసూలు చేయనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏర్పాటు చేయడానికి అవసరమైన మీటర్లు ఇప్పటికే సిద్ధం చేసి పెట్టారు. వీటిని అమర్చే బాధ్యతను అదానీ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ సిబ్బంది గత కొద్ది రోజులుగా ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలోనే మకాం వేసి మీటర్‌ టెస్టింగులు చేస్తున్నారు.

మ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 17.66 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో వాణిజ్య, పరిశ్రమ, ప్రభుత్వ సంస్థల కేటగిరీ కనెక్షన్లు కలిపి 2.05 లక్షలున్నాయి. తొలుత ఈ మూడు కేటగిరీల మీటర్లను మార్చి స్మార్ట్‌ కమ్‌ ప్రీపెయిడ్‌ మీటర్లను అమర్చనున్నారు. తర్వాత దశలో 200 యూనిట్ల పైగా వినియోగించే గృహ విద్యుత్తు కనెక్షన్లకు మార్పు చేయనున్నారు. ఏడాది క్రితమే నగరంలో వంద చోట్ల స్మార్ట్‌ మీటర్లను అమర్చి కొన్ని నెలలు పరీక్షించి చూశారు. ఆ తర్వాత మీటర్ల కొనుగోలుకు సంబంధించి టెండర్లు పిలవడం, గుత్తేదారు సంస్థలను ఖరారు చేసే ప్రక్రియలు చేపట్టారు. ఇందులోనే సర్కారు ముందుగా అనుకున్న సంస్థలకు కట్టబెట్టేలా వ్యవహరించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండానే ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చే బాధ్యతను ముఖ్యమంత్రి సన్నిహితుడు విశ్వేశ్వరరెడ్డికి చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ అప్పగించారు. మిగతా కేటగిరీలకు చెందిన కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల టెండర్లు అదాని సంస్థకు కేటాయించారు.

మీటరు భారం 93 నెలలు.... వ్యవసాయ విద్యుత్తు మీటర్ల ఖర్చుని రైతులపై వేయడం లేదని ఆ మొత్తం తామే భరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా కేటగిరీల మీటర్ల ఖర్చుని మాత్రం వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఒక్కో స్మార్ట్‌ మీటర్‌పై సుమారు రూ.13 వేలు వరకు ఖర్చుచేయబోతున్నారు. నెలనెలా వినియోగించిన కరెంటు ఛార్జీలకు అదనంగా మీటర్ల ఏర్పాటుకు అయ్యే వ్యయం సుమారు రూ.90 ఈఎంఐగా బిల్లులో కలిపే ఇవ్వనున్నారు. ఇలా 93 నెలల్లో మీటరు ఏర్పాటు వ్యయాన్ని వినియోగదారుడి నుంచి రాబట్టుకోనున్నారు. అప్పటి వరకు మీటర్ల నిర్వహణ మొత్తం అదానీ సంస్థ బాధ్యత వహిస్తుంది.


గృహ వినియోగదారుల మెడపై కత్తి..

మ్మడి జిల్లాలో 15 లక్షలకు పైగా గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 200 యూనిట్లు పైబడి వాడిన కనెక్షన్లు సుమారు 8 లక్షల పైగా ఉంటాయని ఈపీడీసీఎల్‌ అధికారులు చెబుతున్నారు. మొదట వాణిజ్య, పరిశ్రమలకే స్మార్ట్‌ మీటర్లు అన్నారు. తర్వాత గృహ వినియోగదారులు కోరితే ఏర్పాటు చేయాలని అంటూనే 200 యూనిట్లు వినియోగం దాటిన కనెక్షన్లకు ప్రీపెయిడ్‌ మీటర్లు అమర్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల ముందర గృహ వినియోగదారులపై స్మార్ట్‌ భారం పెట్టకూడదని పునరాలోచన చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు స్మార్ట్‌ మీటర్లను గృహ వినియోగదారులపై రుద్దకపోయినా దశల వారీగా అన్ని కేటగిరీలు ప్రీపెయిడ్‌ మీటర్లు ఏర్పాటు తప్పనిసరి చేయనున్నారు. వీటితో మీటర్‌ రీడింగ్‌ తీసే సిబ్బంది ఉపాధికి దెబ్బ తగలనుంది. ప్రీపెయిడ్‌ మీటర్లు అమర్చిన తర్వాత మీటర్‌ రీడింగ్‌ తీసే పని ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు