logo

దువ్వకొండ.. మరో రుషికొండలా..!

పెందుర్తి మండలం సౌభాగ్య రాయపురం (ఎస్‌ఆర్‌పురం) గ్రామంలోని దువ్వకొండను వైకాపా నాయకుడు యథేచ్ఛగా కొల్లగొడుతున్నాడు.

Updated : 13 Feb 2024 03:56 IST

అక్రమంగా తవ్వేసి గ్రావెల్‌, రాళ్లు తరలింపు
వైకాపా నాయకుడే ప్రధాన సూత్రధారి

ఎస్‌ఆర్‌పురం (పెందుర్తి), న్యూస్‌టుడే: పెందుర్తి మండలం సౌభాగ్య రాయపురం (ఎస్‌ఆర్‌పురం) గ్రామంలోని దువ్వకొండను వైకాపా నాయకుడు యథేచ్ఛగా కొల్లగొడుతున్నాడు. కొందరు అధికారుల అండతో అక్రమంగా గ్రావెల్‌, కొండరాళ్లను తరలించుకుపోతున్నాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎస్‌ఆర్‌పురం గ్రామం పరిధి సర్వే సంఖ్య 100లోని దువ్వకొండ సుమారు 35 ఎకరాల్లో విస్తరించి ఉంది. గతంలో ఇక్కడ ఫలసాయం సాగు చేసుకొనేందుకు పలువురు రైతులకు డిపట్టాలు ఇచ్చారు. ఇదే కొండపై గనులశాఖ క్వారీకి అనుమతులు మంజూరు చేసింది. రెండేళ్ల క్రితం క్వారీలో అనుమతులకు మించి తవ్వేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు నిర్వాహకులకు భారీ జరిమానాలు విధించారు. వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో కొన్నాళ్లు క్వారీని నిలిపివేశారు. ఇటీవల మళ్లీ తవ్వకానికి అనుమతులిచ్చారు. అప్పటి నుంచి అధికార వైకాపా నాయకుడు కొండను ఇష్టానుసారం తవ్వేసి రూ.కోట్ల విలువైన గ్రావెల్‌, బండరాళ్లను తరలించుకుపోతున్నాడని గ్రామస్థులు చెబుతున్నారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు: దువ్వకొండ వాలు ప్రాంతంలో ప్రభుత్వం గృహ నిర్మాణ పథకం చేపట్టింది. అక్కడ  వైకాపా నాయకుడు అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నాడని పెందుర్తి ఎంపీపీ మధుపాడ నాగమణి గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె కూడా వైకాపా ప్రజాప్రతినిధి కావడం గమనార్హం. అప్పట్లో అధికారులు గ్రావెల్‌ తవ్వుతున్న వాహనాలను స్వాధీనం చేసుకుని జరిమానా విధించి వదిలేశారు. దీంతో అతను మరించి రెచ్చిపోయి, గృహ నిర్మాణ పథకం ప్రాంతాలతో పాటు చుట్టూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తవ్వేసి కొండను కరిగించేస్తున్నాడు. గతంలో అక్కడికి వాహనాలు వెళ్లకుండా జిల్లా సంయుక్త కలెక్టర్‌ ట్రెంచ్‌లు కొట్టించగా, వాటిని కూడా కప్పేసి తాజాగా తవ్వకాలు చేస్తున్నారని స్థానికులు తెలిపారు.

రెండేళ్లలో సుమారు రూ.40కోట్ల దోపిడీ: దువ్వకొండ ప్రాంతం నుంచి ప్రతిరోజు సుమారు 200 లోడ్ల గ్రావెల్‌, మరో 50 లోడ్ల రాయి అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రావెల్‌ లోడు ధర రూ.3వేలు, రాయి లోడు రూ.5వేలు పలుకుతోందని తెలిపారు. ఈ లెక్క ప్రకారం రోజుకు రూ.8.50లక్షలు వైకాపా నాయకుడి జేబులోకి వెళ్తోందని పేర్కొన్నారు. రెండేళ్లుగా జరుగుతున్న ఈ అక్రమ వ్యవహారంలో సుమారు రూ.40కోట్లు దోపిడీ చేశాడని తెలిపారు. అక్రమ తవ్వకాల కారణంగా గృహ నిర్మాణ పథకాల వద్ద కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందని చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, గనుల శాఖ, విజిలెన్స్‌ అధికారులు కనీసం పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలు ఇలాగే కొనసాగితే దువ్వకొండ మరో రుషికొండలా మారుతుందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని