logo

బటన్‌ నొక్కి నెల.. ఆసరా అందేనా?

ఎన్నికలు సమీపిస్తుండడంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాను ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలకు సంబంధించి ప్రచారాన్ని మార్మోగిస్తున్నారు. ఇటీవల పథకాలకు సంబంధించి ఏ బటన్‌నొక్కినా నగదు సకాలంలో ఖాతాల్లోకి జమ కావడం లేదు.

Updated : 22 Feb 2024 05:17 IST

బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న మహిళలు  
పాడేరు, కలెక్టరేట్, న్యూస్‌టుడే

ఎన్నికలు సమీపిస్తుండడంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాను ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలకు సంబంధించి ప్రచారాన్ని మార్మోగిస్తున్నారు. ఇటీవల పథకాలకు సంబంధించి ఏ బటన్‌నొక్కినా నగదు సకాలంలో ఖాతాల్లోకి జమ కావడం లేదు. దీంతో లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఖాతాల్లోకి నగదు పడాలంటే నెలల తరబడి లబ్ధిదారులు వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇటీవల వసతి దీవెన, విద్యాదీవెన, అమ్మఒడి పథకాలకు సంబంధించి బటన్‌నొక్కినా సొమ్ము రావడానికి నెలపైనే సమయం పట్టింది.

త నెల 23న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండలో భారీ బహిరంగ సభలో డ్వాక్రా మహిళలకు వైఎస్‌ఆర్‌ ఆసరా కింద నాలుగో విడత బటన్‌ నొక్కారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి 34,944 స్వయం సహాయక సంఘాలకు చెందిన 3,63,479 మంది మహిళలకు రూ.273.56 కోట్లు, అల్లూరి జిల్లాలో 8,664 స్వయం సహాయక సంఘాలకు రూ.34.6 కోట్లు  వైఎస్‌ఆర్‌ ఆసరా మంజూరైందని అధికారులు ప్రకటించారు.వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నామని కలెక్టర్‌, అధికారులు, డ్వాక్రా మహిళలతో కలసి నమూనా చెక్కును సైతం విడుదల చేశారు. నాలుగు వారాలు దాటినా కనీసం 50 శాతం మంది లబ్ధిదారులు ఖాతాల్లోకి కూడా నగదు జమకాలేదు. దీంతో మహిళలు నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఖాతాను చెక్‌ చేసుకుంటున్నారు. ఎప్పుడు పడతాయో అర్థంకాక ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

నియోజకవర్గాల్లో సంబరాలు చేసి..

ఆసరా పేరిట నియోజకవర్గాల్లో సంబరాలు పేరిట సభలు నిర్వహించారు. ఈ సభలకు సంఘాల మహిళలను బలవంతంగా తరలించారు. ఆసరా పథకం మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతుందని సభల్లో ఊదరగొట్టినా తీరా వెంటనే నగదు జమకాకపోవడంతో మహిళలు విమర్శిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో అసలు నగదు ఖాతాల్లో వస్తాయో లేదో అర్థంకావడం లేదనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరికి అంది, మరికొందరికి రాకపోవడంపై అధికారులను డ్వాక్రా మహిళలు నిలదీస్తున్నారు. మాకెందుకు ఆలస్యంగా జమ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీంతో డీఆర్‌డీఏ అధికారులు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. దీనిపై ఆసరా పథకం జిల్లా డీపీఎం కుమారస్వామిని అడగగా ఇప్పటికే 60 శాతం మంది డ్వాక్రా సభ్యుల ఖాతాల్లో నగదు జమైందని చెప్పారు. మిగిలిన వారికి మూడు రోజుల్లో వచ్చేస్తుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని