logo

Visakhapatnam: అమెరికాలో ఉన్నా.. ఇక్కడ ఓట్లా?

దక్షిణ నియోజకవర్గ పరిధి 148 పోలింగ్‌ కేంద్రం ఓటరు జాబితాలో తప్పులు కనిపిస్తూనే ఉన్నాయి. అమెరికాలో ఉంటున్న వారు ఇక్కడ ఓటర్లుగా నమోదయ్యారు.

Updated : 22 Feb 2024 08:52 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: దక్షిణ నియోజకవర్గ పరిధి 148 పోలింగ్‌ కేంద్రం ఓటరు జాబితాలో తప్పులు కనిపిస్తూనే ఉన్నాయి. అమెరికాలో ఉంటున్న వారు ఇక్కడ ఓటర్లుగా నమోదయ్యారు. చనిపోయిన, శాశ్వత వలసదారుల ఓట్లను తొలగించలేదు. రెల్లివీధి, ఆశీపాపవీధి, ఏవీఎన్‌ కళాశాల ప్రాంతాలు ఈ పోలింగ్‌ కేంద్రం పరిధిలోకి వస్తాయి.

  • ఓటరు జాబితాలో క్రమ సంఖ్య 185, 186, 188లో ముగ్గురు అమెరికాలో ఉంటున్నారు. అయినప్పటికీ వీరి ఓట్లు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఎన్‌ఆర్‌ఐలకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా  పోలింగ్‌ కేంద్రం చివర 999 సీరియల్‌తో ఓటు హక్కు కల్పిస్తుంది. అయితే ఇక్కడ వారి పేర్లను సాధారణ ఓటర్ల మాదిరిగానే ముద్రించారు. శాశ్వత వలసదారులైన 122 మంది పేర్లు జాబితాలో కొనసాగుతున్నాయి.
  • 38వ వార్డు కనకమహాలక్ష్మి (బురుజుపేట) ప్రాంతంలో నివాసం ఉండే వీర్రాజు (వరుస సంఖ్య-401) ఓటు 36వ వార్డులోని రెల్లివీధి పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉంది. ఆయన ఓటు వేయాలంటే బురుజుపేట నుంచి రెల్లివీధికి వెళ్లాల్సి ఉంటుంది.
  • 148 పోలింగ్‌ కేంద్రంలో 867 మంది ఓటర్లు ఉండగా, అందులో 44 మంది మృతులు, 122 మంది శాశ్వత వలసదారులు, డూప్లికేట్‌ ఓట్లు మూడు, డోర్‌ నెంబరు తప్పు-1 వెరసి 170 పొరపాట్లు దొర్లాయి. ఆయా జాబితాలను చూసి ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

పేర్లు... తప్పుల తడక!!

మధురవాడ, న్యూస్‌టుడే: మధురవాడ పరిధిలోని 281, 282 బూత్‌ల పరిధిలోని జాబితాల్లో ఓటరు పేర్లు తప్పుల తడకలుగా ముద్రించారు. ఇసుకపల్లికి బదులుగా యిసుక్పఅలీ అని, ఇందుజాశ్వేతబిందు లంకలపల్లికి ఇందుజా శవేతా బిందు లంకలపఅలీ, మాణిక్యంనాయుడు ఉలూరికి మణిక్యామ్నైడూ ఉలురీ అని, ఇందిరాకుమారి తమ్మిశెట్టికి ఇందిరాకుమారి ఠమ్మీసేతీ, విజయాంబిక పేరు వద్ద వీజయమ్బికా, నాగ హిరణ్మయికి నాగహ్యామ్నాయా తదితర పేర్లతో తప్పులు దర్శనమిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని