logo

వీడని నిర్లక్ష్యం.. అభివృద్ధి శూన్యం..!

‘‘పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందులో భాగంగా ఫార్మాసిటీ పునరావాస కాలనీ శ్మశానాన్ని నెల రోజుల్లోనే అభివృద్ధి చేస్తాం...’’ అంటూ ఉత్తరాంధ్ర జిల్లాల వైకాపా సమన్వయకర్త వైవీ.సుబ్బారెడ్డి

Published : 23 Feb 2024 02:40 IST

ఫార్మాకాలనీ శ్మశానవాటికలో కానరాని సౌకర్యాలు

తాత్కాలికంగా శ్మశానానికి వినియోగిస్తున్న స్థలం

న్యూస్‌టుడే, అగనంపూడి: ‘‘పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందులో భాగంగా ఫార్మాసిటీ పునరావాస కాలనీ శ్మశానాన్ని నెల రోజుల్లోనే అభివృద్ధి చేస్తాం...’’ అంటూ ఉత్తరాంధ్ర జిల్లాల వైకాపా సమన్వయకర్త వైవీ.సుబ్బారెడ్డి గత ఏడాది మే 16న స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రజలకు బహిరంగంగా హామీ ఇచ్చారు.

ఇప్పటికీ 9 నెలలు పూర్తయినా.. నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏళ్ల తరబడి కనీస వసతులు లేని శ్మశానవాటికలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి

  • దాదాపు 15 ఏళ్ల కిందట పరవాడ మండలం పరిధిలో ఔషధ ఆధారిత పరిశ్రమలు (ఫార్మాసిటీ) నెలకొల్పడం కోసం ఏడు నిర్వాసిత గ్రామాలను అగనంపూడి వద్దకు తరలించారు. లేమర్తి, ఈదులపాక, కొత్తపాలెం, పొన్నూరు అగ్రహారం, పానకాలయ్యపేట, ఏదురువానిపాలెం, దొప్పవానిపాలెం గ్రామాలకు చెందిన మూడు వేల కుటుంబాలకు ప్రత్యేకంగా పునరావాసం కల్పించారు.
  • అన్ని గ్రామాలను కలిపి ఒకే చోట పెద్దకాలనీగా ఏర్పాటు చేసి, పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించకపోవడంతో నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు. ప్రత్యేకంగా మరుభూమి కోసం ఎక్కడా స్థలం కేటాయించలేదు. దీనిపై స్థానికులు పలుమార్లు వినతిపత్రాలు అందించినా... పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. ఏళ్ల తరబడి సమస్య పరిష్కారం కావడం లేదు.

చెరువు స్థలంలోనే...

శ్మశానానికి ప్రత్యేకంగా స్థలాన్ని ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులే గొన్నవానిపాలెం చెరువు స్థలంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇటీవల వివిధ కారణాలతో పది మంది కాలనీవాసులు వరుసగా మృతి చెందారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాటు, ఇరుకైన స్థలంలో ఆయా మృతదేహాల అంత్యక్రియలకు స్థానికులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. నిలువ నీడకు షెడ్లు, రాత్రి పూట వెలుగులకు విద్యుత్తు దీపాలు లేవు. చెరువు వద్దకు వెళ్లే మార్గంలో పిచ్చి మొక్కలు, తుప్పలు పెరిగిపోవడంతో విషపురుగుల సంచారం ఎక్కువైంది. ఇన్ని ఇబ్బందుల మధ్య తాత్కాలికంగా అంత్యక్రియలు నిర్వహించుకుంటుంటే... ఇటీవల ఏపీఐఐసీ అధికారులు ఆ స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడంపై నిర్వాసితులు తీవ్రంగా మండి పడుతున్నారు.

స్థలం కేటాయింపు ఎప్పుడో..

ఏపీఐఐసీ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు

ఫార్మా పరిశ్రమల కోసం సుమారు 2500 ఎకరాల భూములు ఇచ్చిన నిర్వాసితుల సౌకర్యార్థం కొంత స్థలాన్ని శ్మశానానికి కేటాయించడానికి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. స్థలం కేటాయిస్తే సొంత నిధులతోనైనా అభివృద్ధి చేసుకుంటామని కాలనీవాసులు చెబుతున్నారు. ఇప్పటికైనా తమ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని నివాసితులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు